● రెండేళ్ల పాలనలో
చంద్రబాబు చేసింది శూన్యం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
దాడిశెట్టి రాజా
తుని: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన రెండేళ్లలో రాష్ట్రంలో మహిళలు, వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు తదితర అన్ని వర్గాలూ వెన్నుపోటుకు గురయ్యాయని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. ఎస్.అన్నవరంలో గురువారం జరిగిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంటే రెట్టింపు సంక్షేమం, అభివృద్ధి చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. నేడు గ్రామం, పట్టణం అనే తేడా లేకుండా విధ్వంసకర పాలన కనబడుతోందని చెప్పారు. ఎంతో కష్టపడి డీఎస్సీ పరీక్షలు రాసి ర్యాంకులు సాధించినా ఉద్యోగం ఇవ్వని విషయం సాక్ష్యాధారాలతో బయటపడిందని అన్నారు. అయినప్పటికీ ఆ విషయాన్ని డైవర్ట్ చేసేలా కూటమి మంత్రులు, నాయకులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
తెలుగు ప్రజల మధ్య పవన్ చిచ్చు
రాష్ట్రం విడిపోయి పన్నెండేళ్లవుతున్నా ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విద్వేషాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని రాజా విమర్శించారు. తెలంగాణలో కోట్ల మంది వ్యాపారులు, ఉద్యోగులు జీవనోపాధి పొందుతున్నారన్నారు. సమయం, సందర్భం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం ధర్మమేనా అని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం ఎంతోమంది ప్రాణాలను త్యాగం చేసిన సందర్భంగా సభ పెట్టుకుంటే.. అదే రోజు తెలంగాణలో సభ పెట్టడానికి యత్నించిన పవన్ కల్యాణ్.. అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ‘ఒక రోజు ముందో, తర్వాతో పెట్టుకుంటే ఇబ్బందులుండేవి కావు కదా? అన్నదమ్ముల్లా కలిసి ఉన్న తెలుగు రాష్ట్రాల్లో మీరెందుకు చిచ్చు పెడుతున్నారు?’ అని ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంచివాళ్లని మీరే చెబుతున్నారు కదా! ఇక మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ‘తెలంగాణలో పోటీ చేస్తానంటున్నారు. చేయండి. మిమ్మల్నెవరు అడ్డుకున్నారు? గతంలో పోటీ చేసి ఏం సాధించారు? మీ వ్యక్తిగత అజెండా కోసం రెండు రాష్ట్రాల ఐక్యతను దెబ్బ తీయవద్దు’ అని పవన్‌కు రాజా హితవు పలికారు.


