అధికారం కోసం ఎన్ని హామీలైనా ఇచ్చి.. ఆనక దగా చేసే నైజం చంద్రబాబు సొంతమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. తుని పట్టణంతో పాటు రూరల్ మండల ప్రజలు, వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ఎస్.అన్నవరంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. దాడిశెట్టి రాజా నాయకత్వాన కూటమి ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు పాలనపై రాజా నిప్పులు చెరిగారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను నిలువునా ముంచేశారని దుయ్యబట్టారు. హామీలు అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మండల కేంద్రమైన కోటనందూరు బస్టాండ్ సెంటర్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరో మండల కేంద్రమైన తొండంగి సెంటర్‌లో జరిగిన నిరసన కార్యక్రమాన్ని రాజా ముందుండి నడిపించారు. సూపర్ సిక్స్ కరపత్రాలను మంటల్లో వేసి దహనం చేసి, టీడీపీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రేలంగి రమణగౌడ్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి సతీష్ తదితరులు పాల్గొన్నారు.


