పెట్రో మంటలపై 9న రాస్తారోకో | - | Sakshi
Sakshi News home page

పెట్రో మంటలపై 9న రాస్తారోకో

Jun 4 2026 5:10 AM | Updated on Jun 4 2026 5:10 AM

ఉమ్మడి జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్లకు ఉద్యోగోన్నతి

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెంపునకు నిరసనగా 9వ తేదీన రాస్తారోకోలు నిర్వహించనున్నట్టు వామపక్ష నాయకులు తెలిపారు. స్థానిక న్యూ డెమాక్రసీ కార్యాలయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు అధ్యక్షతన వామపక్షాల సమావేశం జరిగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం ఇప్పటి వరకు నాలుగు సార్లు పెట్రో ధరలు పెరిగాయన్నారు. కమర్షియల్‌ గ్యాస్‌ ధర మరీ దారుణంగా రూ.వెయ్యికి పైగా పెంచారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతూ సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై భారాలు వేస్తున్నారన్నారు. ఈ నెల మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాలు నిర్వహించి, 9వ తేదీన రాస్తారోకోలు నిర్వహించనున్నట్టు నాయకులు తెలిపారు. సీపీఎం నగర కమిటీ సభ్యుడు కె.సత్తిరాజు మాట్లాడుతూ మోడీ అధికారం చేపట్టిన 12 ఏళ్లలో దేశంలో నిరుద్యోగం పెరుగుతూనే ఉందన్నారు. ఏడో తేదీ సాయంత్రం కాకినాడ మసీదు సెంటర్‌, బాలాజీ చెరువు సెంటర్లలో ప్రచారం నిర్వహించి, 9 వ తేదీ ఉదయం సామర్లకోట రోడ్డు–ఇంద్రపాలెం లాకుల వద్ద రాస్తారోకో చేస్తామన్నారు. సమావేశంలో సీపీఎం నగర కన్వీనర్‌ పలివెల వీరబాబు, న్యూ డెమోక్రసీ నాయకులు గరగ దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

రెండు ఇసుక లారీల సీజ్‌

రావులపాలెం: జిల్లాలో జరుగుతున్న ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలపై బుధవారం తనిఖీలు చేసి గోపాలపురం హైవేపై రెండు ఇసుక లారీలను సీజ్‌ చేసి వాటికి రూ. 50 వేలు అపరాధ రుసుం విధించినట్టు గనుల శాఖ ఏడి అశోక్‌ కుమార్‌ తెలిపారు. అయితే ఈ తనిఖీలు నామమాత్రమేనా అన్నట్టుగా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో జరుగుతున్న అక్రమ ఇసుక, మట్టి తవ్వకాలపై బుధవారం ‘సాక్షి’లో ‘అనదికార దందా’ పేరుతో కథనం ప్రచురితం అయిన విషయం తెలిసిందే. అయితే బుధవారం గోపాలపురం హైవేపై గనుల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే వందలాది లారీలు నిత్యం హైవే మీద తిరుగుతున్నా వారికి మాత్రం గోపాలపురం వద్ద రెండు లారీలే కనిపించడం పలు విమర్శలకు తావిస్తోంది. దీనిపై గనుల శాఖ ఏడీని సాక్షి వివరణ కోరగా తమకు వచ్చిన సమాచారంతో వెళ్లి నిఘా పెట్టగా రెండు లారీలను సీజ్‌ చేశామన్నారు.

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్న 32 మంది డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ సీసీఎల్‌ స్పెషల్‌ సీఎస్‌ జయలక్ష్మి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ జిల్లాలో 14 మందికి, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా 6, తూర్పుగోదావరి జిల్లాలో 7, పోలవరం జిల్లాలో ఐదుగురు డిప్యూటీ తహసీల్దార్లు తహసీల్దార్లుగా ఉద్యోగోన్నతి పొందారు. మెరిట్‌, సీనియారిటీ ప్రాతిపదికన ఈ ఉద్యోగోన్నతులు కల్పించినట్లు ఆమె పేర్కొన్నారు.

సర్‌ అంటే ఏమిటి?

సర్‌ అంటేనే ఏమిటో నాకు తెలీదు. నేను 30 ఏళ్లుగా ఓటు వేస్తున్నాను. మళ్లీ నా ఓటు నిరూపించుకోవడమేమిటి? అసలు సవరణ చేయడం ఏమిటో కూడా నాకు తెలియదు. ఎవరు వస్తారో, ఎప్పుడు వస్తారో తెలీదు. వారు వచ్చిన సమయానికి మేం ఇంటి వద్ద ఉండాలి కదా! ముందుగా ఏం చేయాలో తెలియజేస్తే అన్నీ సిద్ధం చేసుకుంటాం.

– పేపకాయల ప్రసాద్‌, పిఠాపురం

అవగాహన కల్పించాలి

సర్‌ కార్యక్రమం జరుగుతుందని తెలుసు తప్ప అదేమిటి.. మన ఓటు రద్దవకుండా ఎలా చూసుకోవాలనే విషయాలు చాలా మందికి తెలీదు. ఇప్పటి వరకూ నాకే తెలీదు. ఏయే అర్హతలు నిరూపించుకోవాలి.. ఏ ఆధారాలు చూపించాలో ముందుగానే చెప్పాలి. లేకపోతే బీఎల్‌ఓ వచ్చాక ఆధారాలు తెమ్మంటే చాలామంది తేలేకపోవచ్చు. అప్పుడు అర్హత ఉన్నా ఓటు హక్కు కోల్పోవలసి వస్తుంది. దీనిపై ఓటర్లకు పూర్తి అవగాహన కల్పించాలి.

– కొండేపూడి శంకరరావు, మన ఊరు – మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు, పిఠాపురం

పిఠాపురం: ఎన్నికల సంఘం ఈ నెల 15 నుంచి చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ – సర్‌) కార్యక్రమంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓవైపు రాజకీయ పార్టీలు తమ వారి ఓట్లు పోకుండా జాగ్రత్తలు తీసుకుంటూండగా.. ఈ ప్రక్రియపై సామాన్య ఓటర్లలో అవగాహన లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే సర్‌ అంటే ఏమిటో తెలియని వారు కోకొల్లలుగా కనిపిస్తున్నారు. సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో అధికారులు సరిపెట్టేస్తూండంతో.. అవగాహన లేక ఎక్కువ మంది తమ ఓటు హక్కు కోల్పోయే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సర్‌ కార్యక్రమం ఇలా..

అధికారుల లెక్కల ప్రకారం.. జిల్లావ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 1,640 పోలింగ్‌ బూత్‌ల పరిధిలో 16.50 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల 5 నుంచి 14వ తేదీ వరకూ బూత్‌ లెవెల్‌ అధికారుల(బీఎల్‌ఓ)కు సర్‌ కార్యక్రమంపై శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం వీరు ఈ నెల 15 నుంచి జూలై 14వ తేదీ వరకూ ఇంటింటా సర్వే నిర్వహిస్తారు. సర్‌కు అవసరమైన ఎన్యూమరేషన్‌ ఫామ్‌లు, ఇతర సామగ్రిని ఇప్పటికే సిద్ధం చేశారు. బీఎల్‌ఓలు తమకు కేటాయించిన పోలింగ్‌ బూత్‌ల పరిధిలోని ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్‌ ఫామ్‌ అందజేస్తారు. అందులోని వివరాలను ఓటర్లు పూర్తి చేసి, తిరిగి బీఎల్‌ఓలకు అందజేయాలి. దీని ఆధారంగానే ఓటు ఉండాలా, తొలగించాలా అనే నిర్ణయం తీసుకుంటారు. 2002 నాటి ఓటర్ల జాబితాను, ప్రస్తుత ఓటర్ల జాబితాతో మ్యాపింగ్‌ చేయడం ద్వారా నకిలీ ఓట్లు, చనిపోయిన వారివి, ఒకరికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నా ఆధారాలు చూపించని తొలగిస్తారు. అనంతరం, జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. జూలై 21 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను సెప్టెంబర్‌ 18లోగా పరిష్కరించి, అదే నెల 22న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు.

మ్యాపింగ్‌ ఇలా..

‘సర్‌’ నిబంధనల ప్రకారం బీఎల్‌ఓ లింక్‌ ద్వారా 2025 ఓటర్ల జాబితాల్లో ఉన్న వారందరినీ 2002 ఓటర్ల జాబితాతో ఫ్యామిలీ ట్రీ మ్యాపింగ్‌ చేస్తారు. ఏ ఒక్క ఓటరుకు లింక్‌ కాకపోయినా, తగిన ఆధారాలు ఇవ్వకపోయినా వారి ఓటు పోతుంది. సాధారణంగా ఇటువంటి ఓటర్లు 43 ఏళ్లు పైబడే ఉంటారు. 18 నుంచి 43 ఏళ్ల వయస్సు ఓటర్లను వారి తల్లిదండ్రులు లేదా గార్డియన్‌తో లింక్‌ చేస్తారు. పెళ్‌లై అత్త వారింటికి వచ్చిన కోడళ్లు వేరే ఊరి నుంచి వచ్చి ఉంటారు కాబట్టి తమ వాళ్ల ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. మ్యాపింగ్‌లో లింక్‌ కాని వారు ఎన్యూమరేషన్‌ ఫామ్‌ నింపి ఇవ్వాలి. గడువులోగా దానిని నింపి, ఆధారాలివ్వకపోతే ఓటు తొలగిస్తారు. ఈ ప్రక్రియ నిరక్షరాస్యులకే కాదు.. చదువుకున్న వారికి సైతం గందరగోళంగా మారే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నో సంవత్సరాల నుంచి తమకు ఓటు హక్కు ఉందని.. ఇప్పటికే చాలాసార్లు ఓటు వేశామని భావిస్తున్న చాలా మంది ఇప్పుడు తమ హక్కును మళ్లీ ఎందుకు నిరూపించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం సర్‌ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం కనిపిస్తోంది.

ఫ 15 నుంచి ఎస్‌ఐఆర్‌

ఫ ఏర్పాట్లు పూర్తి చేసిన

అధికార యంత్రాంగం

ఫ ఓటర్లలో అవగాహన అంతంతమాత్రం

ఇబ్బంది ఉండదు

ప్రతి బీఎల్‌ఓ తమకు కేటాయించిన బూత్‌ పరిధిలోని అన్ని ఇళ్లకూ వెళ్లి ఎన్యూమరేషన్‌ ఫామ్‌ అందజేసి, వివరాలు తెలియజేస్తారు. కాబట్టి ఎటువంటి అవగాహనా లోపమూ ఉండదు. అర్హుల ఓట్లన్నీ ఉండేలా చూస్తారు. రాజకీయ పార్టీల ఏజెంట్లు కూడా సరి చూసుకుంటారు కాబట్టి సక్రమంగా ఉన్న ప్రతి ఓటూ ఉంటుంది. సామాన్యులకు ఏ ఇబ్బందీ లేకుండా బీఎల్‌ఓలు చూస్తారు.

– గోపాలకృష్ణ, తహసీల్దార్‌, పిఠాపురం

Advertisement
 
Advertisement
Advertisement