బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల భవితకు ప్రభుత్వంతో పాటు జిల్లా అధికార యంత్రాంగం అండగా నిలుస్తుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ భరోసా ఇచ్చారు. కలెక్టరేట్ వివేకానంద హాలులో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘మిషన్ వాత్సల్య’ జిల్లా బాలల సంరక్షణ విభాగం ద్వారా ‘పీఎం కేర్స్’ లబ్ధిదారుల ముఖాముఖి బుధవారం నిర్వహించారు. ఐసీడీఎస్ పీడీ సీహెచ్ లక్ష్మి, చిన్నారులతో ఆయన ముచ్చటించారు. చిన్నారుల చదువు, ఆరోగ్యం, సంరక్షకుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ రకాల ఆర్థిక, విద్యా ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. తద్వారా తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో మొత్తం 24 మంది పిల్లలు లబ్ధిపొందుతున్నారని, వీరి సంరక్షణను జిల్లా బాలల సంరక్షణ విభాగం పర్యవేక్షిస్తోందన్నారు. ఈ పథకం కింద వారికి రూ.10 లక్షల ఆర్థిక సాయంతో పాటు, రూ.5 లక్షల విలువైన ఆయుష్మాన్ భారత్ ఉచిత ఆరోగ్య బీమా అందుతుందని కలెక్టర్ తెలిపారు. ఐసీడీఎస్ పీడీ లక్ష్మి మాట్లాడుతూ ఈ పథకం కింద చిన్నారులకు 18 ఏళ్ల నుంచి నెలవారీ స్టైపెండ్, 23 ఏళ్లకు రూ.10 లక్షల కార్పస్ ఫండ్‌తో పాటు ఉచిత కేంద్రీయ విద్యాలయాల ప్రవేశాలు, ఉన్నత విద్యా రుణాలు, వైద్య సహాయం అందుతాయన్నారు.
వేసవిలో 24.42 లక్షల
ఉపాధి పని దినాలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ప్రస్తుత వేసవి కాలంలో జిల్లాలో ఉపాధి కూలీలకు 24.42 లక్షల పనిదినాలు కల్పించినట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పీడీ మధుసూదన్ తెలిపారు. కలెక్టరేట్‌లోని ఆయన కార్యాలయంలో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 37.12 లక్షల పనిదినాల లక్ష్యం కాగా ఇప్పటి వరకూ 24.42 లక్షల పనిదినాలు పూర్తి చేశామని, ఈ నెలాఖరు నాటికి మిగిలిన 12 లక్షల పనిదినాలు కల్పించనున్నట్టు తెలిపారు. జిల్లాలో 92 వేల మంది ఉపాధి కూలీలకు రూ.52 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. మెటీరియల్ కాంపోనెంట్ కింద మరో రూ.39 కోట్లు విడుదల కావాల్సి ఉందన్నారు. పల్లె పండుగ 1, 2 ల్లో ప్రవేశపెట్టిన పనులు దాదాపు పూర్తయినట్లు చెప్పారు. మూడో విడత పనులకు కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో 12 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. దీనిలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు, ఏపీవోలు ఉన్నారన్నారు. జూలై ఒకటో తేదీ నుంచి జిల్లాలో ‘వీబీజీ రామ్‌జీ’ అమలు కానున్నట్లు చెప్పారు.
పాత పెన్షన్ విధానం
అమలుచేయాలి
ఏపీ విద్యుత్ ఉద్యోగుల సంఘం
ప్రధాన కార్యదర్శి గణపతి
కాకినాడ రూరల్: రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి వీఎస్‌ఆర్‌కే గణపతి డిమాండ్ చేశారు. కాకినాడ శశికాంత్ నగర్‌లో స్థానిక నాయకులతో బుధవారం ఆయన భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి వేతన సవరణ సంప్రదింపుల కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని, ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన మూడు వాయిదాల కరువు భత్యాన్ని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఐదేళ్ల సర్వీసు దాటిన ఎనర్జీ అసిస్టెంట్లను జేఎల్‌ఎంలుగా చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మెనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ప్రమాదానికి గురైన, మృతి చెందిన ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చట్ట సవరణ 2025 బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని గణపతి కోరారు.
వడదెబ్బకు ఉపాధి కూలీ మృతి
ప్రత్తిపాడు: వడదెబ్బకు ఉపాధి కూలీ మృతి చెందిన సంఘటన లంపకలోవ గ్రామంలో బుధవారం ఉదయం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన లింగంపల్లి చక్రధరరావు (55) ఉపాధి కార్మికులతో పాటు ఆ గ్రామంలోని కోమటి చెరువు పూడిక తీత పనులకు వెళ్లాడు. పని ప్రదేశంలో వడదెబ్బ తగిలి కుప్పకూలిపోయాడు. తోటి వేతనదారులు సపర్యలు చేసి, స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తరలిస్తుండగా మృతి చెందాడని పంచాయతీ కార్యదర్శి బి.వీరబాబు తెలిపారు. చక్రధరరావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


