పెళ్లి రోజు నాడే తిరిగిరాని లోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

పెళ్లి రోజు నాడే తిరిగిరాని లోకాలకు..

Jun 3 2026 12:27 AM | Updated on Jun 3 2026 12:27 AM

అన్నవరం: వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి సత్యదేవుని సన్నిధికి వచ్చిన ఓ భక్తుడు.. ఆలయం నుంచి వెలుపలకు వచ్చిన కొద్దిసేపటికే గుండెపోటుకు గురయ్యాడు. ఆసుపత్రికి తరలిస్తూండగా మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. అత్యంత విషాదకరమైన ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. దేవస్థానం వర్గాల సమాచారం ప్రకారం.. అన్నవరం సమీపంలోని బెండపూడికి చెందిన మద్దుకూరి బుచ్చిబాబు (55) పెళ్లి రోజు మంగళవారం. ఆ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి రత్నగిరికి ఆయన వచ్చారు. సత్యదేవుని వ్రతమాచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం, పశ్చిమ రాజగోపురం వెలుపలి ప్రాంగణంలోకి రాగానే గుండెపోటు రావడంతో కింద పడిపోయారు. భార్య, కుమార్తె భయాందోళనతో గట్టిగా కేకలు వేయడంతో ఓ భక్తుడొకరు వచ్చి ఆయన ఛాతీపై గట్టిగా నొక్కుతూ సీపీఆర్‌ చేశారు. పరిస్థితిని గమనించిన దేవస్థానం సెక్యూరిటీ అధికారి ఆకుల ప్రసాదరావు 108కు ఫోన్‌ చేశారు. నిమిషాల వ్యవఽధిలోనే కొండ దిగువ నుంచి వచ్చిన అంబులెన్సులో బుచ్చిబాబును కొండ దిగువ దేవస్థానం ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్య సిబ్బంది.. ఆయన మార్గం మధ్యలోనే మృతి చెందినట్టు తెలిపారు. బుచ్చిబాబుకు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన మృతదేహాన్ని బెండపూడిలోని నివాసానికి తరలించారు.

రత్నగిరిపై భక్తుల రద్దీ

అన్నవరం: రత్నగిరికి మంగళవారం సుమారు 40 వేల మంది భక్తులు తరలివచ్చారు. దీంతో, ఆలయంలో రద్దీ ఏర్పడింది. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. వ్రతాలు 2 వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సాధారణంగా స్వామి సన్నిధికి మంగళవారం భక్తులు తక్కువగా వస్తారు. కానీ, విద్యా సంస్థలకు త్వరలో వేసవి సెలవులు ముగియనుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సాధారణ భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు.

జోసా కౌన్సెలింగ్‌పై

అవగాహన

రాజమహేంద్రవరం రూరల్‌: కాతేరులోని తిరుమల విద్యాసంస్థల ప్రాంగణంలో మంగళవారం జరిగిన జోసా/సి–శాబ్‌ కౌన్సెలింగ్‌ 2026 అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌కు సుమారు 4000 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారని చైర్మన్‌ నున్న తిరుమలరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలలో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారన్నారు. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ, బీఐటీఎస్‌ లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో తమ రాజమహేంద్రవరం క్యాంపస్‌ నుంచి 780 మంది విద్యార్థులు అడ్మిషన్లు సాధించగలరన్నారు. జోసా కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఎలా పెట్టుకోవాలి, ఏ బ్రాంచ్‌లలో సీట్లు వస్తాయో విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అకడమిక్‌ డైరెక్టర్‌ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపాల్‌ వి.శ్రీహరి, తాడేపల్లిగూడెం ఎన్‌ఐటీ డీన్‌ డాక్టర్‌ వీరేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

సత్యదేవుని సన్నిధిలో

భక్తుడికి గుండెపోటు

ఆసుపత్రికి తరలిస్తుండగా

మార్గం మధ్యలో మృతి

Advertisement
 
Advertisement
Advertisement