పొలంలో వంటావార్పు
చేపట్టిన రైతులు
మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ
నిరసన తెలుపుతున్న రైతులు
పిఠాపురం రూరల్: కౌలు, తనఖా పేరుతో బత్తిన పద్మరాజు అనే వ్యక్తి తమను మోసం చేశాడని మండలంలోని మల్లాం, జల్లూరు గ్రామాలకు చెందిన కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పద్మరాజుకు చెందిన పదెకరాల పొలంలో సుమారు 50 మంది రైతులు మంగళవారం వంటావార్పు నిర్వహించి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మల్లాం గ్రామానికి చెందిన పద్మరాజు ఒకే భూమిని పలువురి వద్ద తనఖా పెట్టి.. ఒక్కొక్కరి వద్ద రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ వసూలు చేశాడని ఆరోపించారు. తిరిగి అదే భూమిని వేరొకరికి కౌలుకు ఇచ్చాడని, ఇలా సుమారు రూ.2.50 కోట్లకు పైగా వసూలు చేసి, కాకినాడ రూరల్ ప్రాంతానికి పరారయ్యాడని తెలిపారు. డబ్బులివ్వాలని ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదని, పైగా తమ పైనే బెదిరింపులకు దిగాడని చెప్పారు. దీనిపై నాలుగేళ్లుగా సీఐ నుంచి కలెక్టర్ స్థాయి అధికారి వరకూ ఆశ్రయించినా.. సివిల్ వివాదమంటూ ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, కుటుంబ అవసరాలకు దాచుకున్న డబ్బును పెట్టుబడిగా పెట్టామని, ఇదిగో అదిగో అంటూ ఏళ్ల తరబడి తమను ముప్పుతిప్పలు పెడుతున్నాడని, ఈ మోసం కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని, మోసం చేసిన వ్యక్తిపై తగు చర్యలు తీసుకుని, తమ డబ్బు ఇప్పించాలని అధికారులను వేడుకుంటున్నామని అన్నారు.
ఫ ఒకే భూమి పలువురికి కౌలుకు..
ఫ మోసపోయిన రైతులు
ఫ పొలంలోనే వంటావార్పు


