కాకినాడ క్రైం: వైద్య విద్యలో కాకినాడ కీర్తిపతాక రాష్ట్ర స్థాయిలో రెపరెపలాడింది. రంగరాయ వైద్య కళాశాల(ఆర్‌ఎంసీ)లో 2024లో వైద్య విద్య పూర్తి చేసిన నగరానికి చెందిన వైద్య విద్యార్థి డాక్టర్ అత్తలూరి సాయి అనిరుధ్ ఏకంగా 8 బంగారు పతకాలు సాధించి, యూనివర్సిటీ టాపర్‌గా నిలిచారు. ఒకే విద్యార్థి ఇన్ని బంగారు పతకాలు సాధించడం ఆర్‌ఎంసీయే కాదు.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం జరిగిన ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, వైస్ చాన్సలర్ చంద్రశేఖర్‌లు అనిరుధ్‌కు ఈ పతకాలను ప్రదానం చేశారు. రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు అత్తలూరి విష్ణువర్ధన్, కాకినాడకు చెందిన ప్రసూతి వైద్యురాలు ఏఎల్ సత్యవతి దంపతుల కుమారుడైన అనిరుధ్ తల్లిదండ్రుల సమక్షంలో ఈ విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. నీట్‌లో మంచి ర్యాంకు సాధించిన ఆయన.. మణిపూర్‌లో తన తండ్రి పీజీ చదివిన ప్రతిష్టాత్మక కస్తూర్బా వైద్య కళాశాలలో ఎండీలో పీజీ సీటు సాధించి, ప్రస్తుతం ఫస్టియర్ చదువుతున్నారు.


