తప్పుడు పనిపై నిప్పులు | - | Sakshi
Sakshi News home page

తప్పుడు పనిపై నిప్పులు

Jun 2 2026 12:26 AM | Updated on Jun 2 2026 12:26 AM

మెగా డీఎస్సీనా...దగా డీఎస్సీనా?

బాబు సర్కార్‌పై నిరసన గళం

కదం తొక్కిన వైఎస్సార్‌ సీపీ శ్రేణులు

భారీ ప్రదర్శన, కలెక్టరేట్‌ వద్ద ధర్నా

తొలుగ కలెక్టరేట్‌లోకి

అనుమతించని పోలీసులు

పట్టుబట్టి లోపలికి వెళ్లిన పార్టీ నేతలు

సాక్షి ప్రతినిధి, కాకినాడ/బాలాజీచెరువు: మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేసిన చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్‌ సీపీ శ్రేణులు నిప్పులు చెరిగాయి. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్‌ వద్ద వైఎస్సార్‌ సీపీ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ఎత్తున పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్‌ సెంటర్‌ మీదుగా పార్టీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లెక్స్‌లు, బ్యానర్‌లతో ఆర్డీఓ కార్యాలయం, కలెక్టరేట్‌ వరకు పాదయాత్ర చేశారు. దారి పొడవునా మెగా డీఎస్సీ కాదు, దగా డీఎస్సీ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ప్రదర్శనగా వచ్చిన పార్టీ నేతలు కలెక్టరేట్‌ గేటు బయట రోడ్డుపై బైఠాయించారు. కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం వద్ద ధర్నాకు పోలీసులు నిలువరించినా పార్టీ నేతలు మూకుమ్మడిగా నిరసనను కొనసాగించారు. మెగా డీఎస్సీ–2025 నిర్వహణలో చోటు చేసుకున్న అవకతవకలు, అంతులేని అక్రమాలు, స్కాంలు, డీఎస్సీ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం చేసిన అన్యాయంపై నిరసన వ్యక్తం చేశారు. అభ్యర్థులకు చివరి వరకు మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు. ప్రభుత్వంలో పెద్దలు డీఎస్సీని అడ్డంపెట్టుకుని వ్యాపారం చేశారని నినదించారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు మిన్నంటాయి. ఈ కుంభకోణంపై వాస్తవాలు ప్రజల ముందుంచాలంటే సీబీఐ లేదా హైకోర్టు సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు రావాలని పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు. ధర్నా అనంతరం వైఎస్సార్‌ సీపీ నేతలు జిల్లా అధికారులకు విజ్ఞాపన అందచేసేందుకు కలెక్టరేట్‌ గేట్‌ వద్ద వెళ్లే సరికి పోలీసులు అడ్డుకుని ప్రధాన గేటు వేసేశారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్‌, మహిళా రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తికుమార్‌, రాష్ట్ర యువజన విభాగం జాయింట్‌ సెక్రటరీ మల్లా కిషోర్‌ తదితరులు ఆధ్వర్యంలో గేటును తోసుకుంటూ కలెక్టరేట్‌ లోపలికి వెళ్లారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులకు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.

ఉద్యోగాలు అమ్మేశారు

ఈ సందర్బంగా చంద్రకళాదీప్తికుమార్‌ మాట్లాడుతూ కూటమి నాయకులు నోట్ల కట్టలకు ఆశపడి అనర్హులకు ఉద్యోగాలు అమ్మేశారని ధ్వజమెత్తారు. హోంమంత్రి అనిత యువత కోసం ఉద్యోగాలు ఎదురుచూస్తున్నాయంటూ వాస్తవ విరుద్ధంగా మాట్లాడటం అన్యాయమన్నారు. ఉద్యోగాలు తామే ఇస్తామని గొప్పలు చెప్పడం కాదు, డీఎస్సీలో అర్హులైన అభ్యర్థులకు చిత్తశుద్ధితో న్యాయంచేస్తే అదే పదివేలన్నారు. సమాజ భవిష్యత్‌కు దిక్సూచిలా నిలిచే ఉపాధ్యాయులను తయారుచేసే డీఎస్సీలో చోటు చేసుకుంటోన్న అక్రమాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. టాలెంట్‌ ఉన్న అభ్యర్థులకు అన్యాయం చేస్తే ఆ ఉసురు ప్రభుత్వానికి తగలకుండా పోదన్నారు. భవిష్యత్‌లో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే సామర్థ్యం డీఎస్సీలో అక్రమ మార్గంలో వచ్చే ఉపాధ్యాయులకు ఉంటుందా అని రాగిరెడ్డి ప్రశ్నించారు. మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోననే విషయాన్ని సమాజంలో మేధావి వర్గం ఆలోచించాలన్నారు. విద్య విషయంలో భవిష్యత్‌ తరాలకు చంద్రబాబు ప్రభుత్వం ఏమి చెప్పాలనుకుంటోందని ఆమె నిలదీశారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పెద్దలకు అన్నీ తెలుసున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో మీకు మేమున్నాం అని నీతులు చెప్పిన ప్రభుత్వం కోసం కూటమి కట్టిన నేతలు డీఎస్సీలో జరుగుతున్న అవకతవకలను నిలదీస్తుంటే బూతుల్లా వినపడుతున్నాయా అని ప్రశ్నించారు. ‘నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలి’– డీఎస్సీ అవకతవకలను వెంటనే సరిదిద్దాలి’ అంటూ భారీ ఎత్తున నినాదాలు చేసి కలెక్టరేట్‌లో మెమోరాండం అందించారు. ఆందోళన కార్యక్రమంలో ప్రచార సెల్‌ రాష్ట్ర కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, పార్టీ బీసీ సెల్‌ అధ్యక్షుడు అల్లి రాజబాబు, పసుపులేటి చంద్రశేఖర్‌, కంపర బాబీ, పెద్దాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాల పార్టీ యువజన విభాగం అధ్యక్షులు వీరంరెడ్డి నాని, సకురు గుర్రాజు, దాసం వెంకటేష్‌, యాసలపు పవన్‌, యువజన విభాగం సెక్రటరీ లక్ష్మీకాంత్‌, నేతలు హేమంత్‌, ఉలవల భూషణం, వాసిరెడ్డి చిన్ని, చిన్నారెడ్డి, బొమ్మరిల్లు రమేష్‌, గుత్తుల శ్రీనివాస్‌, పెదిరెడ్ల కృష్ణ, కురందాసు సతీష్‌, గుత్తు గుర్రాజు, మాగాపు గోపి, గరగ సురేష్‌ పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ మెయిన్‌ గేటు వద్ద ధర్నా చేస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు

కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలో పార్టీ అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్‌ తదితరులు

కోర్టు ఉత్తర్వులు లెక్క చేయడం లేదు

డీఎస్సీ కుంభకోణంపై రాష్ట్ర వ్యాప్తంగా గళమెత్తిన వైఎస్సార్‌ సీపీకి వ్యతిరేకంగా టీడీపీ సమావేశాలు నిర్వహిస్తోంది. వైఎస్సార్‌ సీపీకి మద్దతు పలికి డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని సోషల్‌ మీడియాలో డిమాండ్లు వస్తుంటే.. చంద్రబాబు ప్రభుత్వం తప్పును ఒప్పుకోకపోగా తిరిగి ఆసత్య ఆరోపణలు చేస్తోంది. కోర్టు ఉత్తర్వులను సైతం లెక్కచేయకుండా పాలన చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం.

– కురపాటి రమేష్‌,

యువజన విభాగం నేత, వైఎస్సార్‌ సీీపీ

డీఎస్సీలో అవకతవకలపై నిగ్గు తేల్చాలి

డీఎస్సీలో జరిగిన అవకతవకలపై చంద్రబాబు ప్రభుత్వం నిగ్గు తేల్చాలి. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించడానికి టీచర్లతో రాజకీయ సభ నిర్వహించి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తప్పు జరగలేదని విద్యాశాఖ కమిషనర్‌ పాత్రికేయలు సమావేశం నిర్వహించి వివరణ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. శాప్‌ చైర్మన్‌, టీడీపీ ఎమ్మెల్సీలు అంతా సక్రమమంగానే జరిగిందని ఉపన్యాసాలు ఇస్తున్నారు.

– రావూరి వెంకటేశ్వరరావు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రచార సెల్‌.

ఆధారాలున్నా అడ్డంగా బకాయింపు

మెగా డీఎస్సీ–25లో అవకతవకలకు పాల్పడి ఉక్కిరిబిక్కిరి అవుతున్న చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా కథలు చెబుతోంది. కుంభకోణంపై ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన పక్కా ఆధారాలను చూపిస్తున్నా సరైన సమాధానం ఇవ్వడం లేదు. విద్యాశాఖ ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌లో సరైన సమాధానం లభించడం లేదు. శాప్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు ఆర్టీఐ ద్వారా సమాచారం కొరితే ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తూ పిటషనర్లను బెదిరిస్తున్నారు.

– అల్లి రాజబాబు, మాజీ చైర్మన్‌, స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌, కాకినాడ

Advertisement
 
Advertisement
Advertisement