● పిఠాపురం నియోజకవర్గంలో తాగునీటికి కటకట ● గొంతెండుతున్న పలు కాలనీల ప్రజలు
క్యూ కట్టిన మంచినీటి డ్రమ్ములు
ఈ చిత్రంలో ఉన్న ట్యాంకులు, డ్రమ్ములను చూశారా! ఇవి ఏదో నిల్వ చేసుకోడానికి ప్రజలు తమ ఇళ్ల ముందు ఏర్పాటు చేసుకున్నవని అనుకుంటే పొరపాటే. గొల్లప్రోలు నగర పంచాయతీలో తీవ్ర మంచినీటి ఎద్దడి ఏర్పడింది. ఎప్పుడు వస్తుందో తెలియని మున్సిపల్ ట్యాంకర్ కోసం పడిగాపులు పడలేక పట్టణంలోని కొత్త కాలనీ వాసులు.. ఇళ్లపై పెట్టుకునే వాటర్ ట్యాంకులను, డ్రమ్ములను ఇలా తమ ఇళ్ల ముందు పెట్టుకున్నారు. మున్సిపల్ ట్యాంకర్ వచ్చి ఆయా ట్యాంకులు, డ్రమ్ముల్లో నీరు నింపితే.. వాటిని స్థానికులు బిందెలతో తమ ఇళ్లకు మోసుకుంటున్నారు. పవన్ ఇలాకాలో తీవ్రమైన మంచినీటి సమస్యకు ఈ చిత్రం నిదర్శనం.
పిఠాపురం: పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది పిఠాపురం నియోజకవర్గ పరిస్థితి. పేరుకు ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం. రూ.వందల కోట్లతో అభివృద్ధి చేశామని ఇక్కడి జనసేన నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ, నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు గుక్కెడు మంచినీళ్లు దొరకక నరకం చవి చూస్తున్నారు. రోజూ డబ్బులు పెట్టి తాగునీరు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్ప డిందని వాపోతున్నారు. పిఠాపురం మండలం కుమారపురం; కొత్తపల్లి మండలం ఉప్పాడ, సుబ్బంపేట; గొల్లప్రోలు మండలం కొడవలి, చెందుర్తి, గొల్లప్రోలు నగర పంచాయతీ 20వ వార్డు ఈబీసీ కాలనీ, జగనన్న కాలనీల వాసులు తాగునీటికి అల్లాడుతున్నారు. పలు ప్రాంతాల్లోని కుళాయిల నుంచి వారం రోజులుగా నీరు రావడం లేదు. ట్యాంకర్ పంపించాలని అధికారులకు విన్నవించుకున్నా ఫలితం శూన్యం. గొల్లప్రోలు ఈబీసీ కాలనీ జనాభా సుమారు 2,500. ఈ ప్రాంతంలో ఇంతమంది జీవిస్తున్నా తాగునీరు సక్రమంగా అందించకపోతే ఎలాగని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గొల్లప్రోలు జగనన్న కాలనీలో ఇళ్లపై ఉండాల్సిన నీటి ట్యాంకులతో పాటు డ్రమ్ములను ఇళ్ల ముందు పెట్టుకుని, వాటర్ ట్యాంకు రాక కోసం ఇంటిల్లిపాదీ పడిగాపులు పడాల్సి వస్తోంది. అలాగే, 13 వేల జనాభా ఉన్న ఉప్పాడ గ్రామంలో నీటి ఎద్దడి తీవ్రమవడంతో స్థానికులు ఇటీవల ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. ఆయా ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు నిర్మించిన ఓవర్‌హెడ్ ట్యాంకులు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 4 గంటల మధ్యన కుళాయిల నుంచి నీరు వదులుతున్నారని, అది కూడా మురికిగా వస్తోందని, ఏ రోజు ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని కాలనీ వాసులు ఆవేదన చెందుతున్నారు. అసలే వేసవి కాలం కావడం.. ఓవైపు కరెంట్ కోతలు, మరోవైపు తాగునీటి సమస్యతో నియోజకవర్గ ప్రజలు నానా అవస్థలూ పడుతున్నారు.
గొల్లప్రోలు ఈబీసీ కాలనీలో ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్న మహిళలు కొత్తపల్లి మండలం ఉప్పాడలో ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించిన మహిళలు
వారం రోజులుగా ఇబ్బందులు
కుళాయిల నుంచి నీరు అస్సలు రావడం లేదు. మా కాలనీకి మంచినీటి ట్యాంకర్ కూడా రావడం లేదు. వారం రోజులుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాంం. అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. కనీసం తాగునీరైనా ఇప్పించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
– కట్టోజు కృష్ణకుమారి, ఈబీసీ కాలనీ, గొల్లప్రోలు
రాత్రి వేళ ఇస్తున్నారు
మా కాలనీలో కొద్ది రోజులుగా కుళాయిలు రావడం లేదు. ట్యాంకర్‌తో కూడా నీరు ఇవ్వడం లేదు. అప్పుడప్పుడు కుళాయిల నుంచి రాత్రి వేళల్లో నీరు ఇస్తున్నారు. అవి కూడా మురికిగా వస్తున్నాయి. పగటి పూట మంచినీరు ఇవ్వాలి. తాగునీరు లేక చిన్న పిల్లలతో ఇబ్బందులు పడుతున్నా.
– టి.కామాక్షి, ఈబీసీ కాలనీ, గొల్లప్రోలు
ఎదురుచూపులే..
కూలి పనులు చేసుకుని జీవిస్తున్నాం. కుళాయి లేకపోతే మంచినీటి ట్యాంకర్ ఎప్పుడు వస్తాయోనని ఎదురు చూడాల్సిన పరిస్థితి. పనికి సమయానికి వెళ్లాలి. నీటి కోసం ఎదురు చూస్తూంటే పనులకు ఎప్పుడు వెళ్లాలో అధికారులే చెప్పాలి. అర్ధరాత్రి కుళాయిలు ఇస్తున్నారు కానీ, అవి మా వరకూ చేరడం లేదు.
– మలిరెడ్డి అమ్ములు, ఈబీసీ కాలనీ, గొల్లప్రోలు


