తుని రూరల్: ఓవైపు ఎండ మండిపోతున్నా గుండెల నిండా నింపుకొన్న భక్తితో తలుపులమ్మ అమ్మవారి దర్శనానికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 26 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని దేవస్థానం ఈఓ పి.విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,73,895, పూజా టికెట్లకు రూ.4,66,290, తలనీలాలకు రూ.20 వేలు, వాహన పూజలకు రూ.6,390, పొంగలి షెడ్లు, కాటేజీలు, వసతి గదుల అద్దెలు రూ.88,965, విరాళాలు రూ.17,335 కలిపి మొత్తం రూ.7,72,875 ఆదాయం సమకూరిందని వివరించారు. ఆలయ పునర్నిర్మాణ పనుల తర్వాత క్యూ లైన్లపై పూర్తి స్థాయిలో షెడ్లు నిర్మించలేదు. దీంతో, పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు ఆలయం చుట్టూ మండుటెండలో నిలబడలేక విలవిలలాడిపోయారు. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. షెడ్లు వేయకపోతే వేసవిలోనే కాకుండా వర్షాకాలంలో సైతం ఇబ్బందులు తప్పవని, వెంటనే వీటిని నిర్మించాలని భక్తులు కోరారు.
నేడు సీఎం పర్యటన
తుని రూరల్: పింఛన్ల పంపిణీ, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుని మండలం చామవరంలో సోమవారం పర్యటించనున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవిల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 10.50 గంటలకు చామవరం చేరుకుంటారు. ప్రజావేదిక సమావేశం, ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొంటారు. పింఛన్‌దార్లతో 10 నిమిషాలు మాట్లాడుతారు. తరువాత స్థానిక నాయకులతో సమావేశమై, 4.25 గంటలకు హెలికాప్టర్‌లో ఉండవిల్లికి బయలుదేరుతారు.
నేటి పీజీఆర్‌ఎస్ రద్దు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్‌లో ప్రతి వారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను ఈ సోమవారం రద్దు చేశారు. తుని మండలం చామవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తుని పర్యటిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
‘రంగరాయ’ ప్రిన్సిపాల్‌గా
బాధ్యతల స్వీకరణ
కాకినాడ క్రైం: స్థానిక రంగరాయ వైద్య కళాశాల (ఆర్‌ఎంసీ) ప్రిన్సిపాల్‌గా డాక్టర్ ప్రయాగ ఉషాకిరణ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఆర్‌ఎంసీ ఫార్మకాలజీ విభాగాధిపతిగా సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయనకు తాజాగా వైద్య విద్య అదనపు సంచాలకుడిగా (ఏడీఎంఈ) ఉద్యోగోన్నతి లభించింది. ఈ మేరకు ఆయనను కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సత్యదేవుని ఆలయం..
భక్తజన సంద్రం
అన్నవరం: సత్యదేవుని ఆలయం ఆదివారం భక్తజన సంద్రమే అయ్యింది. వందలాది వాహనాల్లో భక్తులు ఉదయం నుంచీ రావడంతో రత్నగిరి, సత్యగిరి పార్కింగ్ స్థలాలు నిండిపోయాయి. ఘాట్ రోడ్డుకు ఇరువైపులా సైతం వాహనాలను నిలిపివేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 3 వేల వ్రతాలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 6 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సూర్య భగవానుడు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైబడిన ఉష్ణోగ్రతతో చెలరేగిపోవడంతో భక్తులు అల్లాడిపోయారు. చెట్ల నీడన, విశ్రాంతి మండపాల్లోను సేద తీరారు. ఆలయం చుట్టూ గ్రీన్ షేడ్ ఏర్పాటు చేసినప్పటికీ ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు పైబడితే వేడి దిగిపోయి, భక్తులు ఆపసోపాలు పడుతున్నారు. ఆలయం చుట్టూ షెడ్డు నిర్మిస్తే ఉపశమనంగా ఉంటుందని, అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు.


