● రత్నగిరి విద్యుత్ సమస్యపై వివరణ
కోరిన ఈపీడీసీఎల్ సీఎండీ
● నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్న ఎస్‌ఈ
● కేబుల్స్ సరి చూసుకోవాలని దేవస్థానానికి సూచన
అన్నవరం: ‘రత్నగిరిపై కరెంటు కష్టాలు’ శీర్షికన ‘సాక్షి’ ఆదివారం ప్రచురించిన కథనానికి ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) సీఎండీ పృథ్వీతేజ్ స్పందించారు. ఈ సమస్యపై జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో ఆయన ఆదివారం సమీక్షించారు. లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు నాణ్యమైన విద్యుత్‌నే సరఫరా చేస్తున్నామని, దేవస్థానం కేబుల్స్‌లోనే సమస్య ఉండవచ్చునంటూ సీఎండీకి వివరణ ఇచ్చినట్టు ఈపీడీసీఎల్ ఎస్‌ఈ జి.ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. దేవస్థానం సబ్ స్టేషన్‌కు నిర్దేశించిన 11 కేవీ విద్యుత్ నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని, లో ఓల్టేజీ లేదని అన్నారు. అందువలన రత్నగిరిపై విద్యుత్ సమస్యను దేవస్థానమే పరిష్కరించుకోవాలని సీఎండీకి వివరించామని తెలిపారు. దేవస్థానం సబ్ స్టేషన్‌కు హంసవరంలోని సబ్ స్టేషన్ నుంచి నేరుగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. కావాలంటే తమ వద్ద రికార్డు అయిన విద్యుత్ సరఫరా డేటాను దేవస్థానానికి అందజేస్తామని తెలిపారు. సబ్ స్టేషన్ మీటర్‌లో కూడా 11 కేవీ విద్యుత్ వస్తోందని తెలిపారు. అక్కడి నుంచి దేవస్థానంలోని వ్రత మండపాలకు, లిఫ్టుకు లో ఓల్టేజీ సరఫరా కావడానికి దేవస్థానం కేబుల్స్‌లో లోపం కారణమై ఉండవచ్చని సీఎండీకి చెప్పామన్నారు. దేవస్థానం అధికారులు ఇప్పటికై నా తమ కేబుల్స్ సరి చూసుకోవాలని ప్రసాద్ సూచించారు.
కొనసాగిన లో ఓల్టేజీ సమస్య
సత్యదేవుని ఆలయంలో రూ.2 వేల వ్రత మండపాల్లో లో ఓల్టేజీ కారణంగా ఆదివారం కూడా ఏసీలు పని చేయలేదు. దీంతో, ఆ వ్రతాలాచరించిన భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సెంట్రల్ ఏసీ పని చేయకపోతే కనీసం తాత్కాలికంగా స్ల్పిట్ ఏసీలైనా బిగించాలని కోరుతున్నారు.


