రత్నగిరిపై కరెంటు కష్టాలు | - | Sakshi
Sakshi News home page

రత్నగిరిపై కరెంటు కష్టాలు

May 31 2026 12:24 AM | Updated on May 31 2026 12:24 AM

సబ్‌ స్టేషన్‌ ఉన్నా తప్పని ఇబ్బంది

లో ఓల్టేజీతో పని చేయని ఏసీలు, లిఫ్టు

కాలిపోతున్న మోటార్లు

భక్తులకు ఇక్కట్లు

అన్నవరం: సత్యదేవుని భక్తులకు విద్యుత్‌ కష్టాలు తప్పడం లేదు. దేవస్థానంలో విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ఉన్నప్పటికీ లో ఓల్టేజీ సమస్యతో ఒక్కోసారి సత్రాల్లో ఫ్యాన్లు తిరగడం లేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఏసీలు సైతం పని చేయడం లేదు. దేవస్థానం ఏటా రూ.1.30 కోట్ల మేర విద్యుత్‌ బిల్లు చెల్లిస్తోంది. గతంలో ఈ బిల్లు రూ.3 కోట్ల వరకూ ఉండేది. అయితే, సోలార్‌ పవర్‌ ప్లాంటు ఏర్పాటు చేశాక సగానికి పైగా బిల్లు భారం తగ్గినా.. భక్తులకు మాత్రం విద్యుత్‌ కష్టాలు పెరిగాయనే అభిప్రాయం వినిపిస్తోంది.

ఇవీ సమస్యలు

● ఓవైపు వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైబడి నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రూ.2 వేల వ్రతాలు చేయించుకుంటున్న భక్తులు.. ఆ మండపాల్లో ఏసీలు పని చేయకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్రతం టికెట్టు రూ.1,500, ఏసీ ఖర్చు రూ.500 అని చెప్పి వసూలు చేస్తున్నా ఏసీలు పని చేయకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు.

● వృద్ధులు, దివ్యాంగుల కోసం సత్యదేవుని ప్రధానాలయం వెనుక లిఫ్టు ఏర్పాటు చేశారు. లో ఓల్టేజీ కారణంగా ఆ లిఫ్టు ప్రస్తుతం సరిగ్గా పని చేయడం లేదు. తరచుగా మధ్యలో ఆగిపోతూండటంతో భక్తులు భయాందోళనలు చెందుతున్నారు. శనివారం రెండుసార్లు ఇలాగే జరిగింది. విద్యుత్‌ సరఫరాను ఆపి, మళ్లీ ఆన్‌ చేయడంతో లిఫ్టు పని చేసింది.

● పంపా నది ఒడ్డున ఉన్న బోర్ల నుంచి నిత్యం రత్నగిరిపై ఉన్న వాటర్‌ ట్యాంకులకు నీటిని పంపింగ్‌ చేస్తూంటారు. ఈ మోటార్లు లో ఓల్టేజీ కారణంగా కాలిపోతున్నాయి. ఈ వేసవి మొదలయ్యాక ఇప్పటి వరకూ ఆరు మోటార్లు ఈవిధంగా కాలిపోయాయి. దీంతో రత్నగిరిపై నీటి సమస్య ఉత్పన్నమవుతోంది.

వ్యవసాయ అవసరాలకు మళ్లింపు

గతంలో కూడా దేవస్థానంలో లో ఓల్టేజీ సమస్య తలెత్తింది. అప్పట్లో రత్నగిరిపై సబ్‌ స్టేషన్‌ నిర్మిస్తే ఈ సమస్య తీరుతుందని విద్యుత్‌ శాఖ అధికారులు చెప్పారు. ఆ మేరకు దేవస్థానం స్థలం ఇవ్వడంతో మూడేళ్ల క్రితం తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ నిర్మించింది. దాని పైన విద్యుత్‌ శాఖ అధికారులు అతిథి గృహం కూడా నిర్మించుకున్నారు. సబ్‌ స్టేషన్‌ ఏర్పాటుతో దేవస్థానానికి విద్యుత్‌ సమస్య ఉండదని అందరూ భావించారు. కానీ, సమస్య యథాతథంగా కొనసాగుతోంది. ఈ సబ్‌ స్టేషన్‌లో నాలుగు ఫీడర్లున్నాయి. వీటిలో రెండు ఫీడర్ల నుంచి మాత్రమే దేవస్థానానికి విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. మిగిలిన రెండు ఫీడర్ల నుంచి పగలంతా వ్యవసాయ విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేవస్థానం అవసరాలకు విద్యుత్‌ చాలడం లేదని దేవస్థానం అధికారులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, రత్నగిరిపై ఉన్న 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌కు ప్రస్తుతం అన్నవరంలోని సబ్‌ స్టేషన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. దీంతో, తమకు అవసరమైనప్పుడు వారు రత్నగిరికి సరఫరా కావాల్సిన విద్యుత్‌ను వాడుకుంటున్నారు. అలా కాకుండా రత్నగిరికి నేరుగా విద్యుత్‌ సరఫరా చేస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందని దేవస్థానం అధికారులు చెబుతున్నారు. పగటి పూట దేవస్థానానికి సుమారు 400 ఓల్టుల సామర్థ్యంతో విద్యుత్‌ సరఫరా జరగాలి. కానీ, 370 ఓల్టులు మాత్రమే వస్తోందని అధికారులు అంటున్నారు. అందువల్లనే రత్నగిరిపై పగటి వేళ విద్యుత్‌ సమస్య ఉత్పన్నమవుతోందని, రాత్రి వేళ ఇబ్బంది ఉండటం లేదని చెబుతున్నారు.

ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈకి లేఖ

దేవస్థానంలో లో ఓల్టేజీ సమస్యపై ఏపీ ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈకి లేఖ రాశాం. సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కరించాలని కోరాం. దేవస్థానం విద్యుత్‌ అధికారులు కూడా దీనిపై నేరుగా ఎస్‌ఈని కలిసి ఫిర్యాదు చేయాలని ఆదేశించాను.

– నల్లం సూర్యచక్రధరరావు,

ఈఓ, అన్నవరం దేవస్థానం

Advertisement
 
Advertisement
Advertisement