రత్నగిరికి పోటెత్తిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

రత్నగిరికి పోటెత్తిన భక్తులు

May 31 2026 12:24 AM | Updated on May 31 2026 12:24 AM

అన్నవరం: సత్యదేవుని ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. సుమారు 40 వేల మంది భక్తులు రావడంతో క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో రద్దీగా మారాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. 2,200 వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. సుమారు 5 వేల మంది సత్యదేవుని అన్న ప్రసాదం స్వీకరించారు.

పవన్‌ వైఖరి ప్రచారార్భాటమే..

రాజమహేంద్రవరం సిటీ: పేపర్‌ మిల్లు రసాయన వ్యర్థాల నుంచి గోదావరి జలాలను, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతానన్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వైఖరి ఒట్టి ప్రచారార్భాటమేనని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్‌ విమర్శించారు. రాజమహేంద్రవరంలోని ఆ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ, గోదావరిని ప్రక్షాళన చేస్తానన్న పవన్‌ కల్యాణ్‌.. రాజమహేంద్రవరం దాటిన వెంటనే మాట మార్చారన్నారు. 262 పంచాయతీలను మురుగు రహితంగా తీర్చిదిద్దాలనడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదన్నారు. పేపర్‌ మిల్లు తెరచి ఉండగా కాలుష్య రహిత పుష్కరాలు సాధ్యమేనా అనే విషయం పవన్‌కు అర్థం కాలేదన్నారు. ఈ మాత్రం దానికి మంత్రి, కలెక్టర్లపై విరుచుకుపడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రాజమహేంద్రవరంలో ఒకలా.. అమరావతిలో మరోలా మాట్లాడటానికి కారణమేమిటో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. పవన్‌ మాటలు వింటూంటే పేపర్‌ మిల్లు యాజమాన్యం ఆయనను రహస్యంగా కలిసిందా అనే అనుమానం కలుగుతోందన్నారు. గోదావరి జల, వాయు కాలుష్యాలు పవన్‌ శాఖ పరిధిలోనివేనని, కానీ, పర్యాటక మంత్రి దుర్గేష్‌పై చిర్రుబుర్రులాడటం ఆయనకే చెల్లిందని విమర్శించారు. గోదావరి జల, వాయు కాలుష్యం ప్రక్షాళనకయ్యే మొత్తం ఖర్చును పేపర్‌ మిల్లు యాజమాన్యమే భరించాలని, ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

గోదావరి డెల్టాకు

నేటి నుంచి సాగునీరు

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఖరీఫ్‌ సాగు నిమిత్తం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గోదావరి కాలువలకు ఆదివారం నుంచి నీరు విడుదల చేయాలని జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం నిర్ణయించింది. కాలువల మరమ్మతుల పరిస్థితిని బట్టి దశల వారీగా నీరు విడుదల చేయనున్నారు. జాయింట్‌ కలెక్టర్‌ మేఘ స్వరూప్‌ అధ్యక్షతన కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్ల మరమ్మతులు, పరిరక్షణ చర్యలకు సుమారు రూ.148 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఇరిగేషన్‌ ఎస్‌ఈ జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఖరీఫ్‌లో సాగునీటి కొరత తలెత్తే పరిస్థితి ఉండదని చెప్పారు. అక్టోబర్‌ 31వ తేదీ వరకూ సాగు, తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement