3 నెలలు.. 300 శాతం లాభాలు | - | Sakshi
Sakshi News home page

3 నెలలు.. 300 శాతం లాభాలు

May 30 2026 2:50 AM | Updated on May 30 2026 2:50 AM

నమ్మించిన సైబరాసురుడు

మోసపోయిన దంపతులు

సామర్లకోట: మూడు నెలల్లో ఏకంగా 300 శాతం లాభాలు వస్తాయంటూ ఓ సైబరాసురుడు విసిరిన ఆన్‌లైన్‌ వలలో పెద్దాపురానికి చెందిన దంపతులు చిక్కుకున్నారు. సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పెడితే కేవలం 3 నెలల్లోనే 300 శాతం లాభాలు వస్తాయంటూ.. ఆనంద్‌ లాఠీ షేర్‌ అండ్‌ స్టాక్‌బ్రోకర్‌ లిమిటెడ్‌ మేనేజర్‌ పేరుతో ఓ సైబర్‌ నేరగాడు.. పెద్దాపురం పట్టణంలోని వర్జుల వారి వీధికి చెందిన సూరే వేణు దంపతులకు వల విసిరాడు. ఆ మాటలు నమ్మి వేణు దంపతులు అతడి వాట్సాప్‌ గ్రూపులో చేరారు. తమ యూజర్‌ ఐడీ ద్వారా విడతల వారీగా ఏకంగా రూ.85 లక్షలు ఆ సైబర్‌ నేరగాడికి డిపాజిట్‌ చేశారు. అనంతరం, ఆ మొత్తాన్ని డ్రా చేసుకునేందుకు వీలు లేకుండా అతడు అకౌంట్‌ బ్లాక్‌ చేశాడు. ఆ తరువాత అతడి నుంచి స్పందన లేకపోవడంతో తాము మోసపోయామని వేణు దంపతులు గ్రహించి, పెద్దాపురం పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. సైబర్‌ నేరాలపై తరచూ అవగాహన కల్పిస్తున్నా ప్రజలు మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్నారని, అపరిచితుల నుంచి వచ్చే వాట్సాప్‌ ఆఫర్లను నమ్మవద్దని ఆయన హెచ్చరించారు.

దాడి చేసిన వారిని

అరెస్టు చేయాలి

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జీజీహెచ్‌ మహిళా సెక్యూరిటీ గార్డులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఏపీ మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన కలెక్టరేట్‌ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌ మాట్లాడుతూ, జీజీహెచ్‌లో మహిళా సెక్యూరిటీ గార్డులపై మార్చి 6న జరిగిన దాడిపై కలెక్టర్‌ స్పందించాలని, ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, ఇలాంటి దాడులు మళ్లీ జరగకుండా ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల పేర్లు చేర్చి, తక్షణం అరెస్టు చేయాలని అన్నారు. ధర్నా అనంతరం డీఆర్‌ఓ తిప్పేనాయక్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఎన్‌.అనిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు భజనకే మహానాడు

కాకినాడ రూరల్‌: టీడీపీ మహానాడు చంద్రబాబు నాయుడి భజన కోసమే ఏర్పాటు చేసినట్టుగా ఉందని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపా ధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి విమర్శించారు. గైగోలుపాడులోని తన నివాసంలో శుక్రవారం ఆమె మీ డియాతో మాట్లాడారు. ఆత్మస్తుతి, జగన్‌పై విమ ర్శలు తప్ప.. ప్రజలకు ఏం మేలు చేస్తారనే ప్రస్తావనే మహానాడులో లేకుండా పోయిందని, ఇది దగానాడు అని దుయ్యబట్టారు. ఆద్యంతం చంద్రబాబు, లోకేష్‌, దేవాన్ష్‌ భజనకే ప్రాధాన్యం ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ ఫలాలను ఎందుకు నిలిపివేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళా రిజర్వేషన్ల పట్ల ఎంతో చిత్తశుద్ధితో వ్యవహరించారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశు ద్ధి ఉన్నా రాజ్యసభ సభ్యుల ఎంపిక, క్యాబినెట్‌లో మహిళా రిజర్వేషన్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఫింఛన్ల లబ్ధిదారులను 6 లక్షలకు పైగా ఎందుకు తొలగించారో, 50 ఏళ్లు దాటిన బీసీ వర్గాల ప్రజలకు పింఛన్లు ఇస్తామనే హామీని ఎందుకు విస్మరించారో చెప్పాలని నాగమణి నిలదీశారు. మెగా డీఎస్సీ పేరిట అర్హులైన యువతకు చేసిన అన్యాయంపై నోరు మెదపకపోవడంపై ఆమె మండిపడ్డారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై చూపుతున్న నిర్లక్ష్యంపై మహానాడులో చర్చ జరగలేదని, కూటమి వంచనపై పెదవి విప్పకుండా, జగన్‌పై మాత్రం విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకొంటున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ సీపీని గొడ్డలి పార్టీ అంటూ తప్పుడు మాటలు మాట్లాడటం తప్ప, రెండేళ్ల పాలనలో సాధించిందేమీ లేదని అన్నారు. ఎన్టీఆర్‌ నుంచి టీడీపీని లాక్కున్న తీరును ప్రజలు ఇంకా మరచిపోలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో సూపర్‌ సిక్స్‌ అని నమ్మించి సూపర్‌ మోసం చేశారని ఆరోపించారు. ఎన్టీఆర్‌కు భారతతర్న ఇవ్వకుండా అడ్డుపడిన చంద్రబాబు.. ఇప్పుడు దీనిపై తీర్మానం ప్రవేశపెట్టడం హాస్యాస్పదమని అన్నారు. డిజిటల్‌ మహానాడులు అట్టర్‌ఫ్లాప్‌ అయ్యాయని, క్లస్టర్ల వారీగా సభా ప్రాంగణాలు వెలవెలబోయాయని నాగమణి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement