దగా డీఎస్సీని రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

దగా డీఎస్సీని రద్దు చేయాలి

May 30 2026 2:50 AM | Updated on May 30 2026 2:50 AM

మెగా డీఎస్సీ–2025 అక్రమాలపై

సీబీఐ విచారణ జరపాలి

వైఎస్సార్‌ సీపీ విద్యార్థి,

యువజన నాయకుల డిమాండ్‌

కాకినాడలో నిరసన

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ప్రభుత్వం నిరుద్యోగులను అన్ని విధాలా మోసం చేసిందని వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం నాయకులు మండిపడ్డారు. మెగా డీఎస్సీ–2025 నిర్వహణలో అక్రమాలకు వ్యతిరేకంగా స్థానిక ఇంద్రపాలెం బ్రిడ్జి అంబేడ్కర్‌ విగ్రహం వద్ద శుక్రవారం ఆందోళన నిర్వహించారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యాన ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరుద్యోగులకు అన్యాయం చేసిన దగా డీఎస్సీని వెంటనే రద్దు చేయాలని, డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని, డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్నారు. నిరుద్యోగులతో ఆటలు ఆడుతూ, దగా చేసిన ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఏటా డీఎస్సీ ఉంటుందని ప్రగల్భాలు పలికి.. రెండేళ్లకు ఒక్కసారి మాత్రమే నిర్వహించారన్నారు. ఇది కూడా పూర్తి అవినీతి మయంగా తయారైందన్నారు. ఉద్యోగాలకు కల్పించకుంటే నిరుద్యోగులకు భృతి ఇస్తామని ఎన్నికల్లో గొప్పగా చెప్పి.. ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం నిరుద్యోగులను అన్ని విధాలా మోసం చేసిందన్నారు. తొలుత అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ విద్యార్థి, యువజన విభాగాల నాయకులు నీలి ఆనంద్‌, పూసల అనిల్‌, ఉయ్యూరి నాని, గంగవరపు రాజేష్‌, మామిడాల గౌతమ్‌తేజ, కరణం భానునాయుడు, డి.శివకుమార్‌, జె.పృథ్వీరాజ్‌, నల్లమిల్లి పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement