శభాష్‌ లక్ష్మణా.. | - | Sakshi
Sakshi News home page

శభాష్‌ లక్ష్మణా..

May 30 2026 2:50 AM | Updated on May 30 2026 2:50 AM

నిజాయతీకి నిలువుటద్దంలా నిలిచిన యువకుడు

రూ.20 లక్షల బంగారు ఆభరణాలు పోగొట్టుకున్న మహిళ

భద్రంగా అందజేసిన యువకుడు

కపిలేశ్వరపురం (మండపేట): మాయమైపోతున్నాడమ్మా.. మనిషన్నవాడూ.. అనుకుంటున్న ప్రస్తుత కాలంలో ఓ యువకుడు నిజాయతీకి నిలువుటద్దంలా నిలిచి.. పది మందితో శభాష్‌ అనిపించుకున్నారు. మండపేట రూరల్‌ సీఐ పి.దొరరాజు, బాధితుల కథనం ప్రకారం.. ఈ నెల 24వ తేదీ సాయంత్రం మండలంలోని ఏడిద గ్రామానికి చెందిన పేరిచర్ల శ్రీలేఖ తన కుటుంబ సభ్యులతో కలసి ఆటోలో ఓ శుభకార్యానికి బయల్దేరారు. ఈ క్రమంలో రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్న బ్యాగ్‌ను పోగొట్టుకున్నారు. ఆ బ్యాగ్‌ ఏడిద గ్రామ శివారు దేవుడు కాలనీ సమీపాన అదే గ్రామానికి చెందిన యువకుడు నామాల లక్ష్మణరావుకు దొరికింది. అదే మహద్భాగ్యమనుకుని ఆ ఆభరణాలను పట్టుకుపోవాలనే దుర్బుద్ధికి అతడు లోనవలేదు. ఆ ఆభరణాల పట్ల ఎలాంటి వ్యామోహాన్నీ పెంచుకోకుండా.. పోగొట్టుకున్న వారికే తిరిగి అందజేయాలని తపన పడ్డాడు. బ్యాగ్‌లో ఉన్న ఆధార్‌ కార్డులోని అడ్రస్‌కు సమాచారం అందించారు. సీఐ దొరరాజు, ఎస్సై వి.కిశోర్‌ సమక్షంలో బాధితురాలు శ్రీలేఖకు ఆ ఆభరణాల బ్యాగ్‌ను అప్పగించారు. నిజాయతీగా వ్యవహరించిన లక్ష్మణరావును పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు, ప్రజలు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement