వెనుకస్తేనా! | - | Sakshi
Sakshi News home page

వెనుకస్తేనా!

May 29 2026 10:14 AM | Updated on May 29 2026 10:14 AM

పిఠాపురం: ఎప్పటిలాగే వ్యవసాయ శాఖ ముందస్తు సాగు పల్లవి అందుకుంది. ఖరీఫ్‌ సాగు ముందుగా చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఆ మేకు రైతులకు అవగాహన కల్పిస్తోంది. ఏటా ఖరీఫ్‌ చివరన నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో వస్తున్న అధిక వర్షాలు, తుపానుల ప్రభావంతో రైతులు పెద్ద ఎత్తున పంటలు నష్టపోతున్నారు. ఈ గండం నుంచి గట్టెక్కాలంటే ముందస్తు సాగు చేపట్టాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. అయితే, క్షేత్ర స్థాయిలో రైతులకు ఎక్కడికక్కడే సమస్యలు ఎదురొస్తున్నాయి. ప్రధానంగా సాగునీటి కాలువల ఆధునీకరణ, నిర్వహణ పనులను ప్రభుత్వం గాలికొదిలేసింది. జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టు అయిన ఏలేరు అభివృద్ధికి నిధులు కేటాయించలేదు. మరోవైపు పెట్రో ధరల పెంపుతో రైతులపై అదనపు భారం పడనుంది. ఇటువంటి పరిస్థితుల్లో ముందస్తు సాగు సాధ్యం కాదని, ‘వెనుక’స్తు సాగు తప్పదని రైతులు అంటున్నారు.

ఈ రకాలు వద్దు

రానున్న ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా రైతులు 2.36 లక్షల ఎకరాల్లో వరి, ఇతర పంటలు సాగు చేయనున్నారు. సుమారు 7 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. సాగు ఆరంభానికి ముందే పీఆర్‌–126, ఎస్‌ఎల్‌–10, ఎంటీయూ–1153, ఎంటీయూ–1156 రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ అధికారులు ప్రచారం చేస్తున్నారు. ఖరీఫ్‌లో వర్షాలను తట్టుకుని, అధిక దిగుబడులిచ్చే రకాలు మాత్రమే సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నారు. అమూల్య, అంకుర్‌, ఎంటీయూ–7029, సాధన, ఓం సాయి, ఆర్‌జీఎల్‌–2537 సోనాం, సంపద సువర్ణ, రేవతి, బీపీటీ–5204 రకాల విత్తనాలు వేయాలని చెబుతున్నారు.

పంటకు పెట్రో మంట

పెరిగిన కూలి రేట్లు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వంటి వాటి ధరలతో ఇప్పటికే రైతులకు సాగు భారమవుతోంది. పుండుపై కారం చల్లినట్లు ఇటీవల పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచడం వారిపై మరింత భారాన్ని మోపనుంది. కొన్నేళ్లుగా సాగులో యంత్రాల వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో దుక్కి దున్నడం, దమ్ము, నాట్లు, కోతలు, ధాన్యం ఇంటికి చేర్చడం వరకూ అన్నింటికీ ఎక్కువ మంది రైతులు యంత్రాల పైనే ఆధారపడుతున్నారు. పెట్రో ధరల పెంపుతో ఈ యంత్రాల అద్దె భారీగా పెరిగి, సాగుకు అదనపు పెట్టుబడి అవుతుందని రైతులు వాపోతున్నారు. గతంలో ఎకరాకు రూ.40 వేల వరకూ పెట్టుబడి కాగా, ఇప్పుడు రూ.50 వేల వరకూ ఖర్చవుతుందని చెబుతున్నారు.

ఎరువు.. బరువు

ఇటీవల ప్రభుత్వం ఎరువుల ధరలను సైతం భారీగా పెంచింది. కాంప్లెక్స్‌ ఎరువుల బస్తాపై రూ.300 పెంచింది. దీంతో, ఒక్కో బస్తా కాంప్లెక్స్‌ ఎరువుకు రూ.2 వేలు పైనే ఖర్చవనుంది. ఓవైపు పెట్టుబడి విపరీతంగా పెరుగుతూండగా.. క్వింటాల్‌ ధాన్యానికి కేవలం రూ.70 మాత్రమే మద్దతు ధరను పెంచి ప్రభుత్వం చేతులు దులుపుకొందనే విమర్శలు రైతుల నుంచి వస్తున్నాయి. ఇటువంటి సమస్యల నడుమ ముందస్తు సాగు ఏవిధంగా చేపట్టగలమని వ్యవసాయ అధికారులను రైతులు ప్రశ్నిస్తున్నారు.

అస్తవ్యస్తంగా పంట కాలువలు

కాలువల ఆధునీకరణ పనులు సక్రమంగా జరగలేదు. దీంతో, సాగునీరు సకాలంలో అందే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు సాగు ఏవిధంగా సాధ్యం? ఎండలున్న సమయంలో కాలువ పనులు చేయడం లేదు. వర్షాలు కురిశాక చేయడం వల్ల ఆ పనులు సక్రమంగా జరగక సాగు నీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

– వి.గోవిందరాజులు,

రైతు, భోగాపురం, పిఠాపురం మండలం

పెరగనున్న పెట్టుబడులు

గతం కంటే ఈ ఏడాది వ్యవసాయ పెట్టుబడులు బాగా పెరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా పెట్రో ధరల పెంపు వల్ల మరింత భారం పడుతుంది. రైతుకు ప్రభుత్వం ఎటువంటి సహకారమూ ఇవ్వడం లేదు. అన్నీ ప్రకటనలే తప్ప క్షేత్ర స్థాయిలో రైతును ఆదుకునే ప్రయత్నాలు చేయడం లేదు. ముందస్తు సాగు అని ప్రకటించడం కాదు.. దానికి తగ్గ సహకారం కూడా ఉండాలి.

– పి.ప్రసాద్‌, రైతు, తాటిపర్తి,

గొల్లప్రోలు మండలం

ఆగస్టు 15 లోగా నాట్లు

పూర్తి చేయాలి

ఖరీఫ్‌ సాగుకు వ్యవసాయ శాఖ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. రైతులు ఆగస్టు 15వ తేదీ లోగా నాట్లు పూర్తి చేయాలి. జూన్‌ ఒకటో తేదీన పిఠాపురం బ్రాంచి కెనాల్‌ నుంచి, జూలై 1న ఏలేరు నుంచి సాగు నీరు విడుదల చేయాలని నిర్ణయించారు. ఆలోగా రైతులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. విత్తనాలు సిద్ధం చేస్తున్నాం.

– పి.స్వాతి, వ్యవసాయ శాఖ ఏడీ, పిఠాపురం

ముందస్తు సాగుకు

వ్యవసాయ శాఖ ప్రణాళికలు

అన్నదాతకు ఎదురొస్తున్న సమస్యలు

అధ్వానంగా పంట కాలువలు

పెట్రో ధరల పెంపుతో రైతులపై

అదనపు భారం

Advertisement
 
Advertisement
Advertisement