కూతంత జోరందుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కూతంత జోరందుకోవాలి

May 29 2026 10:14 AM | Updated on May 29 2026 10:14 AM

సామర్లకోట: జిల్లాలోనే కీలకమైన రైల్వే జంక్షన్‌ సామర్లకోట. చైన్నె – కోల్‌కతా మార్గంలో ఉన్న ఈ స్టేషన్‌ మీదుగా గూడ్సు రైళ్లతో కలిపి నిత్యం 160 నుంచి 180 వరకూ రైళ్లు రాకపోకలు సాగిస్తూంటాయి. ప్రయాణికులకు సంబంధించి ప్రతి రోజూ దాదాపు 90 రైళ్లు ఇక్కడ ఆగుతాయి. కాకినాడ, పెద్దాపురం, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, ఏలేశ్వరంతో పాటు తూర్పు గోదావరి జిల్లా రంగంపేట, అనపర్తి, బిక్కవోలు తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 17 వేల మంది నిత్యం సామర్లకోట రైల్వే స్టేషన్‌ పైనే ఆధారపడతారు. ఎక్కువ మంది విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌, చైన్నె, బెంగళూరు, ఢిల్లీ తదితర నగరాలకు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తారు. ఆన్‌లైన్‌ టికెట్లతో బుకింగ్‌ కౌంటర్‌ ఆదాయం తగ్గిపోయినప్పటికీ.. ప్రయాణికుల నుంచి ప్రతి రోజూ సుమారు రూ.5 లక్షల ఆదాయం వస్తుంది. నెలకు రూ.1.50 కోట్లు, ఏటా దాదాపు రూ.18 కోట్ల మేర ఆదాయం లభిస్తుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్‌ భారత్‌ పథకం కింద ఎంపిక చేసింది. గతంలో వైఎస్సార్‌ సీీపీకి చెందిన వంగా గీత కాకినాడ ఎంపీగా ఉన్న సమయంలో ఈ పథకం కింద రూ.25 కోట్లు మంజూరు చేసింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఈ పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్లాట్‌ఫామ్‌ల అభివృద్ధి, షెడ్ల నిర్మాణం, నూతన కార్యాలయ, విశ్రాంతి భవనాలు, ప్రయాణికుల సౌకర్యాలతో పాటు మూడు ప్లాట్‌ఫామ్‌లను కలుపుతూ రెండో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి(కాలి బాట వంతెన)తో పాటు ఎస్కలేటర్‌ నిర్మాణ పనులు చేపట్టారు. అయితే, కొన్నాళ్లుగా ఈ పనులు ఎక్కడిక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆదిలోనే హంసపాదు

ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ నుంచి 2, 3 ప్లాట్‌ఫామ్‌లను కలుపుతూ ఎస్కలేటర్‌ నిర్మాణాన్ని ప్రారంభించి ఆరు నెలలైంది. ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఈ పనులు ప్రారంభ దశలోనే నిలిచిపోయాయి. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఈ పనులను నిలిపివేసినట్లు సమాచారం. ఎస్కలేటర్‌ పనుల కోసమం 1, 3 నంబర్‌ ప్లాట్‌ఫామ్‌లపై రిజర్వేషన్‌ బోగీలను సూచించే డిస్‌ప్లే బోర్డులను తొలగించారు. దీంతో, ఏ బోగీ ఎక్కడ వస్తుందో తెలియక రిజర్వేషన్‌ ప్రయాణికులు ప్లాట్‌ఫామ్‌లపై పరుగులు తీస్తున్న దుస్థితి నెలకొంది. చివరకు ఏదో ఒక బోగీ ఎక్కి, తమ సీట్లకు చేరుకోవాల్సి వస్తోంది. విశాఖపట్నం వైపు వెళ్తే వారు ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ పైన, విజయవాడ వైపు వెళ్లే వారు మూడో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌లపై వేచి ఉంటారు. అయితే, ప్లాట్‌ఫామ్‌ల చివరి వరకూ అభివృద్ధి పనులకు సంబంధించిన రేకులు పడేయడంతో ప్రయాణికులు ఒకరి వెనుక ఒకరు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. రైలు కోసం ఏ మాత్రం అజాగ్రత్తగా పరుగు తీసినా ప్రమాదాలు జరిగే అవకాశం పొంచి ఉంటోంది.

ఆరుబయటే వాహనాల పార్కింగ్‌

రైల్వే స్టేషన్‌ ఆవరణలో ద్విచక్ర వాహనాలు, కార్లు పార్కింగ్‌ చేసుకోవడానికి ఓపెన్‌ ఆక్షన్‌ ద్వారా లీజుకు ఇస్తారు. ద్విచక్ర వాహనం పార్కింగ్‌కు గంటకు రూ.10 చెల్లించాలి. గంట దాటితే అదనపు చార్జీ వసూలు చేస్తున్నారు. అయితే, పార్కింగ్‌ ప్రదేశంలో షెడ్లు లేకపోవడంతో ద్విచక్ర వాహనాలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయి. పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తున్నప్పటికీ కనీస సదుపాయాలు కల్పించకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పరుగులు తీయాల్సి వస్తోంది

రిజర్వేషన్‌ బోగీలు ఎక్కడున్నాయో తెలియక ప్లాటఫామ్‌పై పరుగులు తీయాల్సి వస్తోంది. ఆరు నెలలుగా ఇదే పరిస్థితి. బోగీల సమాచారాన్ని మైకులో ప్రకటిస్టున్నా అర్థం కావడం లేదు. అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి, ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలి. ద్విచక్ర వాహనాలకు షెడ్లు లేకపోవడం దారుణం. ఎండలకు పెట్రోలు ఆవిరైపోతోంది.

– కాళ్ల లక్ష్మీనారాయణ,

మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్‌, సామర్లకోట

Advertisement
 
Advertisement
Advertisement