ఊళ్లలోనే టైఘర్‌ | - | Sakshi
Sakshi News home page

ఊళ్లలోనే టైఘర్‌

May 29 2026 10:14 AM | Updated on May 29 2026 10:14 AM

వెనుకే అధికారుల పరుగు

ఐదు నెలలుగా ఇదే తంతు

ఇప్పటి వరకూ 20 మూగజీవాలపై పంజా

రాజవొమ్మంగి: ఐదు నెలలుగా అదే పరుగు... ఎక్కడా అలుపు లేదు.. వెనక్కి తగ్గిందీ లేదు.. జనావాసాలు, ఆపై అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తూనే ఉంది. పట్టుకుంటామంటూ, దీని వెనుక అధికారులు పరుగులు తీస్తూనే ఉన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోకి పెద్ద పులి సుమారు ఐదు నెలల కిందట ప్రవేశించింది. అప్పటి నుంచి అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. బుధవారం ఒక్క రోజే ఏడు మూగజీవాలను పొట్టనబెట్టుకుంది. ఈ ఏడాది జనవరి 31న తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం చినకొండేపూడిలోకి ఈ పులి ప్రవేశించింది. అక్కడి నుంచి దివాన్‌చెరువు, రాజానగరం మండలం జి.ఎర్రంపాలెం, ఆ తరువాత అనపర్తి మండలం పీరా రామచంద్రపురంలో తిరిగింది. ఫిబ్రవరి 6న తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురంలో అటవీ అధికారులకు చిక్కింది. దానిని అక్కడి నుంచి విశాఖపట్నం జూ పార్క్‌కు తరలించారు. కొన్నాళ్ల తర్వాత మెడలో రేడియో కాలర్‌ అమర్చి దానిని పాపికొండలు అడవుల్లో తిరిగి వదిలిపెట్టారు.

మళ్లీ పులి తన పయనం మొదలుపెట్టింది. ఫిబ్రవరి మూడో వారంలో రంపచోడవరం, రాజవొమ్మంగి, ఏలేశ్వరం, అడ్డతీగల ప్రాంతాల మీదుగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు, శంఖవరంలో ప్రవేశించింది. తిరిగి వెనుకకు మళ్లి, దేవీపట్నం మండలంలో గోదావరి ఈదుకుంటూ అవతలి ఏలూరు జిల్లా పోలవరం మండలంలో సంచరించింది. అంతలోనే తిరిగి తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ అటవీ ప్రాంతానికి చేరింది. దేవీపట్నం మండలం ఇందుకూరుపేట, కొత్తవీధి, బూరుడుబంద గ్రామాల సమీపంలోని దట్టమైన అడవులకు చేరింది. ఆ తరువాత ఫోక్స్‌పేటలో పులి జాడను అటవీ అధికారులు కనుగొన్నారు.

దాడి చేస్తూ.. ముందుకు సాగుతూ

గత 15 రోజులుగా ఈ పులి రాజవొమ్మంగి అడవుల్లోనే తిరుగుతోంది. బుధవారం ఒక్కరోజే చికిలింత, గర్రంగి గ్రామాల్లో 9 మూగజీవాలపై పంజా విసిరింది. ఇప్పటి వరకూ 20 పశువులను హతమార్చింది.

అధికారుల చర్యలు విఫలం

ఇంత జరుగుతున్నా పులిని పట్టుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారంటూ గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పులి భయంతో అడవి, పొలం పనులకు వెళ్లలేక పోతున్నామని వాపోతున్నారు. తొలకరి వర్షాలు కురుస్తుండడంతో రెండు, మూడు రోజుల్లో ఖరీఫ్‌ పనులు మొదలు పెట్టాలని, పులి తమ చుట్టూ తిరుగుతుంటే పనులు ఎలా చక్కబెట్టుకోవాలని గురువారం ఆయా గ్రామాల్లో పర్యటించిన రంపచోడవరం డీఎఫ్‌ఓ శివకుమార్‌ను గిరిజనులు ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ పులి రాజవొమ్మంగి మండలం ఉర్లాకులపాడు అటవీ ప్రాంతంలో ఉందని, తడోబా, నాగార్జున టైగర్‌ రెస్క్యూ టీములు వస్తాయని, త్వరలోనే దీనిని బంధిస్తామని ఆయన చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement