పెద్దాపురం ఆర్‌డీఓగా కృష్ణమూర్తి | - | Sakshi
Sakshi News home page

పెద్దాపురం ఆర్‌డీఓగా కృష్ణమూర్తి

May 29 2026 10:14 AM | Updated on May 29 2026 10:14 AM

సామర్లకోట: పెద్దాపురం ఆర్‌డీఓగా పి.కృష్ణమూర్తి గురువారం బాధ్యతలు స్వీకరించారు. సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని సూర్యశ్రీ ఫైర్‌ వర్క్స్‌లో గత ఫిబ్రవరి 28వ తేదిన జరిగిన భారీ విస్ఫోటంలో 28 మంది మృతి చెందిన విషయం విదితమే. అప్పట్లో సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు రెవెన్యూ, పోలీసు, కార్మిక, అగ్నిమాపక శాఖల అధికారులను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా అప్పటి వరకు పెద్దాపురం ఆర్‌డీఓగా ఉన్న కె.శ్రీరమణిని సస్పెండ్‌ చేశారు. ఇన్‌చార్జి ఆర్‌డీఓగా ఎన్‌.శ్రీధర్‌ను నియమించారు. ఇన్‌చార్జిల పాలనతో ఇబ్బందులు ఏర్పడుతూండటంతో.. కోనసీమ జిల్లాలో కోనేరు రంగారావు కమిటీ (కేఆర్‌ఆర్‌సీ) స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్న కృష్ణమూర్తిని పూర్తి స్థాయి ఆర్‌డీఓగా నియమిస్తూ ఈ నెల 25న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఆయా శాఖల్లో సస్పెండ్‌ అయిన వారి సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఇటీవల ఎత్తివేసింది.

విద్యార్థినికి అబార్షన్‌పై

డీఎంహెచ్‌ఓ విచారణ

అమలాపురం టౌన్‌: స్థానిక నల్ల వంతెన ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఇంటర్‌ విద్యార్థినికి అబార్షన్‌ చేసిన ఘటనపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) ఎం.దుర్గారావుదొర, అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ భరతలక్ష్మి విచారణ చేపట్టారు. ఆ ఆస్పత్రికి వెళ్లి విద్యార్థినికి అబార్షన్‌ చేసిన విధానం, కేస్‌ షీటు తదితర అంశాలను పరిశీలించారు. అబార్షన్‌కు వాడిన మందులు, కేస్‌షీటులో పేర్కొన్న మందులకు పొంతన లేదని గుర్తించారు. విచారణ అంశాలను కలెక్టర్‌ మహేష్‌కుమార్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో ఆర్‌డీఓ జి.మమ్మీ, డీఎంహెచ్‌ఓ దుర్గారావుదొర, ఐసీడీఎస్‌ పీఓ కె.నాగమణి తదితర అధికారులతో కలెక్టర్‌ ఓ కమిటీని నియమించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని ఆదేశించారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు రెండు రోజుల్లో అందజేస్తామని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ దుర్గారావుదొర తెలిపారు.

మూతపడిన ఆస్పత్రి

ఈ ఘటనతో విద్యార్ధినికి అబార్షన్‌ చేసిన ఆస్పత్రిని తాత్కాలికంగా మూసివేయాలని డీఎంహెచ్‌ఓ ఆస్పత్రి వైద్యురాలు శిరీషను ఆదేశించారు. ఆస్పత్రిలో అబార్షన్‌ అయి, చికిత్స పొందుతున్న విద్యార్థినికి మాత్రమే వైద్యం అందించాలని సూచించారు. కొత్తగా పేషెంట్లను పరీక్షించడం గాని, చేర్చుకోవడం గాని వద్దని ఆదేశించారు. ఈ ఘటనపై నిందితులపై కేసులు నమోదు కాలేదు. విచారణ కమిటీ నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటారని తెలిసింది. ఆస్పత్రి వద్ద మోటారు సైకిళ్లు వదిలేసి విద్యార్థిని ప్రియుడు, అతని స్నేహితులు పరారయ్యారు. ఇక్కడి ప్రైవేటు ఆస్పత్రి నిర్వహణను ప్రభుత్వ వైద్యాధికారిణి పర్యవేక్షిస్తున్న తీరును విచారణ కమిటీ తప్పు పడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement