ఫ శివశివా
సాక్షి ప్రతినిధి, కాకినాడ: దేవుడి గుడి నిర్మిస్తామంటూ చందాలు వసూలు చేయడం చూస్తూంటాం. ఆలయ నిర్మాణం పూర్తయిపోయాక ఇక చందాల వసూలు ఆపేస్తారు. కానీ, తెలుగు తమ్ముళ్ల రూటే సెపరేటు. ఆలయ నిర్మాణం పేరుతో అక్రమ వసూళ్లకు తెర తీశారు. ఆ నిర్మాణం పూర్తయిపోయినా ఇప్పటికీ దేవుడి పేరుతో వసూళ్ల దందా సాగిస్తూనే ఉన్నారు. ఈ దోపిడీ ఎక్కడో కుగ్రామంలో జరుగుతోందనుకుంటే ‘తప్పు’లో కాలేసినట్టే. కోల్‌కతా – చైన్నె 16వ నంబర్ జాతీయ రహదారిపై కృష్ణవరం టోల్‌గేటు సాక్షిగా అక్రమార్జనకు తెగబడుతున్నారు. టీడీపీ ముఖ్య నేతల కనుసన్నల్లోనే ఈ అక్రమ వసూళ్లు సాగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి కృష్ణవరం టోల్‌గేటుకు ప్రత్యామ్నాయంగా తెలుగు తమ్ముళ్లు అనధికార టోల్‌గేటు వంటిది పెట్టి.. ముక్కుపిండి మరీ వసూళ్లు చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏడాదిన్నర కాలంగా దేవుడి గుడి ముసుగేసుకుని కోట్లు కొల్లగొడుతున్నారు. బహిరంగంగానే ఈ దోపిడీ సాగుతున్నా అడిగే నాథుడే లేకుండా పోయాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి టెండర్ ప్రక్రియలో టోల్‌గేటును దక్కించుకున్న నిర్వాహకులు కూడా టీడీపీ నేతలకు అడ్డు చెప్పలేక చేతులెత్తేశారు.
ఏం జరుగుతోందంటే..
కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద జాతీయ రహదారిపై ఎప్పట్నుంచో అధికారికంగా టోల్‌గేటు ఉంది. రాజమార్గమైన ఈ టోల్‌గేటు మీదుగా వెళ్తే పోలీసు, రవాణా, రెవెన్యూ అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో.. ఇసుక, మట్టి, గ్రావెల్ టిప్పర్లు, లారీలు ఇక్కడ అడ్డదారిలో వెళ్తున్నాయి. బూరుగుపూడి శివారున పోలవరం కాలువ గట్టు, కృష్ణవరం మీదుగా దోపిడీదారులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆ గ్రామంలోని చిన్నచిన్న వీధుల్లో సుమారు 60 నుంచి 65 టన్నుల ఇసుక, మట్టి లోడు టిప్పర్లు, లారీలు తిరుగుతున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఇసుక, మట్టి టిప్పర్లు యథేచ్ఛగా తిరుతూండటంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. వాటి ధాటికి ఇళ్ల గోడలు కూడా బీటలు వారుతున్నాయని, ఎవరికి మొర పెట్టుకున్నా ఫలితం ఉండటం లేదని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు టన్నులకొద్దీ బరువైన లారీలు తిరుగుతూండటంతో గ్రామంలోని సీసీ రోడ్లు ధ్వంసమైపోతున్నాయి.
కృష్ణవరం ‘తమ్ముడి’ దందా
సరిగ్గా ఇక్కడే టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. కృష్ణవరం టోల్‌గేటుకు సమాంతరంగా ఇసుక, మట్టి అక్రమ రవాణాదారులు రాకపోకలు సాగిస్తున్న అడ్డదారిలో గ్రామ శివారును అనధికారికంగా మరో టోల్‌గేటు వంటిది తెరిచారు. శివాలయం కడుతున్నామనే పేరుతో ఇక్కడ అనధికారికంగా రోజువారీ వసూళ్లకు తెగబడుతున్నారు. జగ్గంపేట నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్య నేతకు కృష్ణవరంలో ఉన్న ముఖ్య అనుచరుడు, అతని అనుయాయులే ఈ దందాకు పాల్పడుతున్నారు. అఽధికారిక టోల్‌గేటుకు ఆదాయం రాకుండా చేసి, దొడ్డి దారిన డైలీ రూ.లక్షలు దోచుకుంటున్నారు. అక్కడ ఒక పాక ఏర్పాటు చేసి, ఇసుక, గ్రావెల్ టిప్పర్లు, ఇతర వాహనాల నుంచి దౌర్జన్యంగా డబ్బులు గుంజుతున్నారు. ఇర్రిపాక, సోమవరం, కృష్ణవరం ఏలేరు కాలువ నుంచి నిత్యం ఇసుక, మట్టి లోడుతో ఈ మార్గంలో రాజమహేంద్రవరం వైపు 150 వరకూ టిప్పర్లు, లారీలు వెళ్తూంటాయి. ఈ మార్గంలో వెళ్తే ఆ వాహనాలకు అధికారుల అనుమతులు, అదనపు లోడుతో వెళ్తే అడ్డుకుంటారనే భయం ఉండదు. పైగా, ఈ మార్గానికి పచ్చ నేతల అండదండలు కూడా ఉండటంతో గుట్టు చప్పుడు కాకుండా దొడ్డిదారిలో మట్టి, ఇసుక పెద్ద ఎత్తున తరలించుకుపోతున్నారు. ఇదే అదునుగా టీడీపీ నేతలు ఈ మార్గంలో భారీ వాహనం నుంచి రూ.1,000కి తక్కువ కాకుండా అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఈవిధంగా నెలకు రూ.అర కోటి పైగా వసూలు చేస్తున్నారన్నది అంచనా. ఇలా అక్రమంగా వస్తున్న సొమ్మును సంబంధిత ‘కృష్ణవరం తమ్ముడు’ నెలకోసారి లెక్క తేల్చి ముఖ్య నేతలకు తలా రూ.10 లక్షల చొప్పున దేవుడి హుండీలో మాదిరిగా ముడుపు మూటగట్టి ముట్టజెబుతున్నారని ఆ గ్రామం కోడై కూస్తోంది.
దౌర్జన్యం
అడ్డదారిలో వాహనాల రాకపోకలను అడ్డుకునేందుకు బూరుగుపూడి సమీపాన అధికారిక టోల్‌ప్లాజా నిర్వాహకులు గతంలో బ్యారియర్లు ఏర్పాటు చేశారు. అయితే, అక్రమార్జనకు అలవాటు పడిన తెలుగు తమ్ముళ్లు ఈ బ్యారియర్లను రాత్రి పూట పొక్లెయిన్లతో రెండు మూడు పర్యాయాలు దౌర్జన్యంగా తొలగించేశారు. దీంతో, చేసేది లేక టోల్‌ప్లాజా నిర్వాహకులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు.
కొసమెరుపు
ఈ దందాలో బిగ్ ట్విస్ట్ అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. కృష్ణవరం ఏలేరు నది ఒడ్డున శ్రీ విజయేశ్వరి సమేత విశ్వనాథస్వామి, గ్రామ దేవత శ్రీమంట్లమ్మ అమ్మ ఆలయాల పేరు చెప్పి తెలుగు తమ్ముళ్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. కానీ, ఆ ఆలయాల నిర్మాణాలు ఎప్పుడో 2018లోనే పూర్తి కావడం, అక్కడకు భక్తులు నిత్యం వచ్చి దర్శించుకుంటూ, పూజలు కూడా చేస్తూండటం కొసమెరుపు. అయినప్పటికీ, ఆ ఆలయాల నిర్మాణం పేరుతో ఏడాదిన్నర కాలంగా తెలుగు తమ్ముళ్లు అడ్డూ అదుపూ లేకుండా దోపిడీకి పాల్పడుతూండటం.. కళ్ల ముందే ఇదంతా జరుగుతున్నా అధికారులు మిన్నకుండిపోవడం విచిత్రం.
ఫ దేవుడి పేరిట నిలువు దోపిడీ
ఫ తమ్ముళ్ల దందా
ఫ కృష్ణవరంలో నకిలీ టోల్‌గేటు
ఫ నిర్మాణం పూర్తయిన ఆలయాల పేరిట వసూళ్లు
ఫ నెలకు అరకోటి వసూళ్లు
ఫ ఏడాదిన్నరగా యథేచ్ఛగా దందా


