తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారికి హుండీల ద్వారా రూ.54,44,339 ఆదాయం సమకూరిందని లోవ దేవస్థానం ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. దేవదాయ శాఖ జిల్లా అధికారి వి.వెంకటేశ్వరరావు, గ్రేడ్–1 ఈఓ ఎం.మురళీ వీరభద్రరావు పర్యవేక్షణలో దేవస్థానంలోని హుండీలను బుధవారం తెరచి నగదు లెక్కించారు. మొత్తం 58 రోజులకు నాణేల రూపంలో రూ.3,46,308, నోట్ల రూపంలో రూ.50,98,031 ఆదాయం లభించిందని ఈఓ విశ్వనాథరాజు వివరించారు.
హ్యాండ్‌బాల్ పోటీలకు
జిల్లా జట్టు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): విజయనగరం జిల్లాలో గురు, శుక్రవారాల్లో జరిగే రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు బుధవారం పయనమైంది. జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంవీవీ దుర్గాప్రసాద్ ఈ విషయం తెలిపారు. జట్టులో పవన్ గణేష్, సోమరాజు, ఎంఎస్ రాజు, పాల్‌జోన్స్, హేమంత్‌సాయి, వెంకట గణేష్, కుర్షద్, భవిక్, కె.నరూన్, చరణ్‌తేజ, వీరేంద్ర, ప్రజ్వల్, నిశాంత్‌రెడ్డి, చైతన్య, సూర్యకుమార్ ఉన్నారని వివరించారు.
రెండు వర్కింగ్ వుమెన్
హాస్టళ్ల మంజూరు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కేంద్ర ప్రభుత్వం జిల్లాకు రెండు వర్కింగ్ వుమెన్ హాస్టళ్లను మంజూరు చేసింది. ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బుధవారం ఈ విషయం తెలిపారు. ఉద్యోగం, ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మహిళల కోసం కాకినాడ, పిఠాపురం ప్రాంతాల్లో ‘సఖి నివాస్’ పథకంలో భాగంగా వీటిని కేంద్రం ఏర్పాటు చేస్తోందని వివరించారు. ఒక్కోచోట 30 మంది మహిళలకు వసతి కల్పిస్తారన్నారు.
నీట్ పేపర్ లీకేజీ
కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే
గోకవరం: నీట్ పేపర్ లీకేజీకి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని, సంబంధిత మంత్రిని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరంజనేయులు డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీపై సంఘం ఆధ్వర్యాన శివరామపట్నంలో బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కర్నాకుల మాట్లాడుతూ, గతంలో కూడా అనేకసార్లు పేపర్ లీకవడంతో వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదని విమర్శించారు. ఈ ఏడాది కూడా నీట్ పేపర్ లీకవడంతో రేయింబవళ్లు కష్టపడి చదివిన సుమారు 15 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం కలచివేసిందన్నారు. నీట్ పరీక్షల నిర్వహణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని కర్నాకుల డిమాండ్ చేశారు.
కేసుల సత్వర
పరిష్కారానికి చర్యలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉచిత న్యాయ సహాయ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని 9వ అదనపు జిల్లా జడ్జి జి. షణ్ముఖరావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యార్లగడ్డ శ్రీలక్ష్మిక్ష పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో బుధవారం మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. దీనికి హాజరై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానల్ న్యాయవాదులు, డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో సమీక్ష నిర్వహించారు. వివిధ కేసులలో ఉచిత న్యాయ సహాయం అందించేందుకు నియమితులైన న్యాయవాదులతో ఆయా కేసుల పురోగతిని సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.


