కొత్తపల్లిలో కురుస్తున్న భారీ వర్షం
ఎడారిలో దిక్కు తోచక తిరుగుతున్న వారికి ఒయాసిస్సు కనిపించినట్టు.. కొన్నాళ్లుగా చండప్రచండంగా ఎండలు మండిపోతున్న వేళ.. ఉన్నట్టుండి ‘వరుణ’ రాగం వినిపించింది. తొండంగి తదితర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి వర్షం కురిసిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపా అన్నట్టు కాకినాడ, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో బుధవారం ఉదయం ఆకాశాన దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. సుమారు గంట పాటు కురిసిన ఈ వర్షం ప్రజలకు సూర్యప్ర‘తాపం’ నుంచి రోజంతా ఉపశమనాన్నిచ్చింది. వానకు ఈదురు గాలులు కూడా తోడవడంతో అక్కడక్కడ చెట్లు నేల కూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. కాకినాడలో ఆర్‌టీఓ కార్యాలయం వద్ద రోడ్డుపై చెట్టు కూలిపోవడంతో వలసపాకల వైపు వెళ్లే వాహనాలు కొద్దిసేపు ఒకే మార్గంలో రాకపోకలు సాగించాల్సి వచ్చింది. దీంతో, ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈదురు గాలులు, భారీ వర్షం కారణంగా కొత్తపల్లి మండలం కొమరగిరి శివారు నాగపేటలో తాటిచెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. దీంతో, మూడు విద్యుత్ స్తంభాలు, సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ నేలకొరిగాయి. దీంతో, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈపీడీసీఎల్ అధికారులు, సిబ్బంది చెట్లను తొలగించి, విద్యుత్ స్తంభాలు వేసి, సరఫరాను పునరుద్ధరించారు.
– కాకినాడ రూరల్/కొత్తపల్లి


