బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో జల్ జీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యాన కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమగ్ర సమీక్షలో ఆయన మాట్లాడారు. జల్ జీవన్ మిషన్ పనులు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం, నీటి వనరుల పరిరక్షణ, భూగర్భ జలాల అభివృద్ధి, మంచినీటి ట్యాంకుల క్లోరినేషన్, పారిశుధ్య పనులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల పురోగతి, తాగునీటి ట్యాంకులకు స్థల సేకరణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వంటి అంశాల ప్రగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ నిరంతరాయంగా సురక్షిత తాగునీరు అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రతి గ్రామాన్ని 2028 నాటికి హర్ ఘర్ జల్ గ్రామంగా తీర్చిదిద్దాలన్నారు. రౌతులపూడి మండలంలో రూ.356 లక్షల అంచనాతో చేపట్టనున్న 18 పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, ఇరిగేషన్, వ్యవసాయం, డ్వామా, గ్రౌండ్ వాటర్, ఐసీడీఎస్, డీఆర్‌డీఏ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


