● అపరిశుభ్రతకు కేరాఫ్‌గా గ్రామాలు
● పట్టించుకోని ప్రత్యేక అధికారులు
● రోడ్ల పక్కన పేరుకుపోతున్న చెత్త
● మంచినీటికీ కటకట
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ప్రస్తుతం పల్లెలు అధ్వానంగా ఉన్నాయి. రెండు నెలల క్రితం గ్రామ పంచాయతీ పాలకవర్గాల గడువు ముగియడంతో ప్రత్యేక అధికారులను నియమించారు. చంద్రబాబు సర్కారు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రస్తుతం ఆయా గ్రామాలు.. ప్రజల కనీస అవసరాలు తీర్చేలేని పరిస్థితుల్లో ఉన్నాయి. పారిశుధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా, వీధిలైట్ల మరమ్మతులు కూడా చేయలేని పరిస్థితి నెలకొంది. కాకినాడ జిల్లాలో 385 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా గ్రామ పంచాయతీల్లో మండల కేంద్రాల్లో ఉండే అధికారులను గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారిగా నియమించారు. వారు ఎప్పుడో వీలు చూసుకొని వారానికో, 10 రోజులకో గ్రామాలకు చుట్టం చూపుగా వస్తున్నారు. దీంతో గ్రామాల్లో ప్రజలు వారి అవసరాలు తీరక అనేక అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీలో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. డ్రైనేజీల్లో సిల్ట్ పేరుకుపోయినా నెలల తరబడి తీయకపోవడంతో దుర్వాసన వెదజల్లడంతో ఆయా గ్రామాల ప్రజలు నిత్యం దుర్వాసన మధ్య జీవనం సాగించాల్సిన పరిస్థితి దాపురించింది.
దోమల రొద
డ్రైనేజీల నిర్వహణ అధ్వానంగా ఉండడంతో దోమల సమస్య ఎక్కువైంది. దీంతో ప్రజలు రాత్రి సమయాల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలం కావడంతో గ్రామాల్లో ఆరుబయట పడుకుందామంటే అక్కడ దోమలతో సావాసం చేయాల్సి వస్తోంది. గ్రామాల్లో చెత్తతో సంపద తయారీ కేంద్రాలు పనిచేయడం లేదు. పలు గ్రామాల్లో చెత్తను రోడ్డు పక్కన వేసి పంచాయతీ సిబ్బంది తగలబెట్టడంతో రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు పొగతో అనేక అవస్థలు పడుతున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా తయారైన కనీసం బ్లీచింగ్ కూడా చల్లడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. వీధి దీపాలు వెలగకపోయినా మరమ్మతులు కూడా చేయించలేని దుస్థితి నెలకొంది. గతంలో గ్రామ పంచాయతీలో సర్పంచులు ఉంటే స్వయంగా గ్రామాల్లో పర్యటించి ఎక్కడ సమస్య ఉన్న వెంటనే సిబ్బందితో ఆయా పనులు పూర్తి చేయించేవారు. అవసరమైతే తమ సొంత నిధులు వెచ్చించి తర్వాత బిల్లులు తీసుకునేవారు. ప్రస్తుతం ప్రత్యేక అధికారులు సంతకం లేనిదే నిధులు విడుదల చేసే అధికారం లేకపోవడంతో గ్రామ కార్యదర్శి గ్రామ పంచాయతీలో ఏ పని చేయాలన్న ఇబ్బందులకు పడాల్సిన పరిస్థితి నెలకొంది.
తప్పని తాగునీటి సమస్య
ప్రస్తుతం ఎండలు విపరీతంగా ఉండడంతో పలు గ్రామాల్లో మంచినీటి సమస్య వేధిస్తోంది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం శివారు ప్రాంతాలకు మంచినీటి ట్యాంకర్లు పంపడం నిలిపివేసింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో శివారు ప్రాంతాలకు మంచినీరు ట్యాంకర్ల ద్వారా పంపేందుకు జిల్లాకు నిధులు కేటాయించేవారు. చంద్రబాబు సర్కారు ఈ నిధులు నిలిపివేయడంతో గ్రామ పంచాయతీల ద్వారా శివారు ప్రాంతాలకు మంచినీరు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీల్లో నిధులు లేక జిల్లాలోని జగ్గంపేట, సామర్లకోట, కరప, రౌతులపూడి వంటి మండలాల్లో మంచినీటికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రత్యేకాధికారులు
గ్రామాలకు రావడం లేదు
ప్రత్యేకాధికారులు అసలు గ్రామాల వైపు తొంగి చూడడం లేదు. వారికి గ్రామస్తుల సమస్యలు కూడా తెలియడం లేదు. అత్యవసర పనులు చేసేందుకు కూడా వారాల సమయం తీసుకొంటున్నారు. మంచినీరు, విద్యుత్‌దీపాలు, పారిశుధ్య సమస్యలుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
– సాదే ఆశాజ్యోతి, కరప మాజీ సర్పంచ్


