ఓటరు జాబితాపై శ్రద్ధ చూపాలి | - | Sakshi
Sakshi News home page

ఓటరు జాబితాపై శ్రద్ధ చూపాలి

May 27 2026 12:11 AM | Updated on May 27 2026 12:11 AM

సామర్లకోట: మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల జరిగిన ప్రెస్‌మీట్‌లో అనేక ప్రశ్నలను సంధిస్తే ఒక్కదానికీ సమాధానం ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. మంగళవారం వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు అధ్యక్షతన జరిగిన బూత్‌ లెవెల్‌ ఏజెంట్ల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డీఎస్‌సీలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన దుర్మార్గంగా ఉన్నదని, వారి తప్పులను కప్పి పుచ్చుకోవడానికి జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ సీపీకి చెందిన ప్రతీ నాయకుడు బీఎల్‌ఎలపై శ్రద్ధ చూపి ఓటర్లను కాపాడుకోవాలన్నారు. స్థానిక సంస్థలలో కూటమి పార్టీలు ఓటమి చెందితే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందనే ప్రచారం జరుగుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రతిపక్ష నాయకులు, సానుభూతి పరుల ఓట్లు తొలగించే అవకాశం ఉందన్నారు. వచ్చే నెల నుంచి నెల రోజుల పాటు సర్‌పై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వం నియమించిన బీఎల్‌ఓలు ఇంటింటా తిరిగే సమయంలో వారితో టచ్‌లో ఉండాలన్నారు. అర్హత ఉన్న వారి ఓట్లు తొలగిస్తే వెంటనే పార్టీ నాయకులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కాకినాడ జిల్లా పరిశీలకులు దాట్ల సూర్యనారాయణరాజు మాట్లాడుతూ 24 సంవత్సరాల తరువాత ఓటర్ల సవరణ జరుగుతున్నందున ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సర్‌ టాస్క్‌ఫోర్సు కమిటీ సభ్యుడు బీవీఆర్‌ చౌదరి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలలో ఓట్లు తొలగించిన విధంగా రాష్ట్రంలో జరుగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా బూత్‌ కమిటీ అధ్యక్షుడు ఒమ్మి రఘురాం బీఎల్‌ఎలకు శిక్షణ ఇచ్చారు. టాస్క్‌ఫోర్సు కమిటీ సభ్యులు వాసిరెడ్డి జమీల్‌, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నెక్కంటి సాయిప్రసాద్‌, రాష్ట్ర అయ్యరక సంఘ అధ్యక్షుడు ఆవాల లక్ష్మీనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు తలారి దొరబాబు, పట్టణ పార్టీ అధ్యక్షుడు పాగా సురేష్‌కుమార్‌, నియోజకవర్గ యూత్‌ అధ్యక్షుడు వీరంరెడ్డి నాని పాల్గొన్నారు.

బీఎల్‌ఎల అవగాహన సదస్సులో

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు రాజా

Advertisement
 
Advertisement
Advertisement