మోతుగూడెం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాలను కలిపే వంతెన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు సీలేరు నదిపై పొల్లూరు వద్ద వంతెన పనులు చురుగ్గా సాగుతున్నాయి. గత ఐదేళ్ల క్రితం ఒడిశా ప్రభుత్వం వంతెన పనులు ప్రారంభించినప్పటికీ వివిధ కారణాల వలన నత్తనడకన పనులు సాగాయి. అయితే వచ్చే సంవత్సరం మూడేళ్లకు ఒకసారి వచ్చే మన్యంకొండ జాతర జరుగుతుండడంతో ఒడిశా అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మన్యం కొండ జాతరకు సీలేరు నది దాటి సుమారు లక్షకు పైగా ఒడిశా గిరిజనులు పొల్లూరు వాటర్‌ఫాల్స్ వద్దకు వచ్చి పూజలు నిర్వహిస్తారు. అయితే అప్పుడు తాత్కాలిక ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేసి రాకపోకలు సాగించేందుకు ఏర్పాట్లు చేస్తారు. అయితే వంతెన నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో పూర్తి చేసేందుకు పనులు వేగవంతం చేశారు. ఇప్పటివరకు సుమారు ఏడు పిల్లర్లు పూర్తి కాగా మరో మూడు పిల్లర్ల పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఈ అంతరాష్ట్ర బ్రిడ్జి పనులు పూర్తయితే అటు ఒడిశాతో పాటు ఇటు ఆంధ్ర ప్రజల వ్యాపారాలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఒడిశా సరిహద్దు గ్రామ ప్రజలకు విద్య, వైద్యానికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీలేరు నది సరిహద్దున ఉన్న ఒడిశా గిరిజనులు ప్రతి చిన్న అవసరానికి సీలేరు నది దాటి పొల్లూరు వస్తారు. ఇక్కడ నుంచి సీలేరు, ఇతర గ్రామాలకు రాకపోకలు సాగిస్తారు. ఎంతో ప్రాధాన్యం ఉన్న బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు ఒడిశా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
వంతెన నిర్మాణంతో మేలు
పొల్లూరు వద్ద సీలేరు నదిపై వంతెన నిర్మాణంతో ఒడిశా గిరిజనులకు మేలు జరుగుతుంది. ప్రతి అవసరానికి పొల్లూరు, మోతుగూడెం వస్తారు. వంతెన నిర్మాణంతో పడవపై ప్రయాణించే ఇబ్బంది తప్పుతుంది. వ్యాపార లావాదేవీలు పెరుగుతాయి.
– ప్రసాద్, మోతుగూడెం


