జూలై నెలాఖరులోపు వరి నాట్లు | - | Sakshi
Sakshi News home page

జూలై నెలాఖరులోపు వరి నాట్లు

May 27 2026 12:11 AM | Updated on May 27 2026 12:11 AM

జూన్‌ 1న సాగునీరు విడుదల

స్వల్పకాలిక వరి వంగడాలే మేలు

జిల్లా సాగునీటి

సలహా మండలి సమావేశం

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): తూర్పు డెల్టా రైతులు జూలై నెలాఖరులోపు వరినాట్లు పూర్తి చేసుకోవాలని, అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావ సూచన నేపథ్యంలో నేరుగా విత్తే విధానం వద్దని, స్వల్పకాలిక వరి వంగడాల సాగే చేపట్టాలని కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ రైతులకు సూచించారు. ఖరీఫ్‌ 2026 సీజన్‌లో కాకినాడ జిల్లాలో అన్ని సాగునీటి వ్యవస్థల కింద మొత్తం 3,70, 354 ఎకరాల పంటలకు సాగునీరు అందించేందుకు ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో తొలుత గోదావరి హెడ్‌ వర్క్స్‌ ఎస్‌ఈ జి.శ్రీనివాస్‌ జిల్లాలో వివిధ వ్యవస్థల కింద ఖరీఫ్‌ సాగుకు అందుబాటులో ఉండే నీటి నిల్వల వివరాలను వివరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో చర్చించిన సాగునీటి ప్రణాళికకు అనుగుణంగా జిల్లాలో గోదావరి తూర్పు డెల్టా కింద జూన్‌ 1 నుంచే సాగునీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఏలేరు, పంపా రిజర్వాయర్ల నుంచి జూలై మొదటి వారంలోనూ, పుష్కర లిఫ్ట్‌, తాండవ ప్రాజెక్టుల ద్వారా జూలై రెండో వారంలోను, వర్షాలు ప్రారంభమయ్యాక సుబ్బారెడ్డి సాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి ఆగస్టు రెండవ వారంలోను నీటిని విడుదల చేసేందుకు షెడ్యూల్‌ రూపొందించామన్నారు. జిల్లాలో గోదావరి తూర్పు డెల్డా కింద కాలువ శివారున ఉన్న పెదపూడి, సామర్లకోట, కాకినాడ రూరల్‌, అర్బన్‌, కరప, కాజులూరు, తాళ్లరేవు మండలాలకు జూన్‌ మొదటి వారానికి నీరు చేరనున్న నేపథ్యంలో జూన్‌ 10 నుంచి నెలాఖరులోపు నారుమళ్లు ముగించి, జాలై నెలాఖరు నాటికి వరినాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. ప్రభుత్వ సేకరించని 1156, 1153, 1010, సీఆర్‌ 126 రకాల వంగడాలను సాగు చేయవద్దని సూచించారు. తక్కువ కాలపరిమితి గల వరి రకాల విత్తనాలను సిద్ధంగా ఉంచాలని వ్యవసాయశాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. రైతులకు అవసరమైన యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, సబ్సిడీ ఎరువుల పంపిణీని మరింత పారదర్శకం చేసేందుకు రాష్ట్రంలోనే పైలట్‌ ప్రాజెక్ట్‌గా కాకినాడ జిల్లాను ఎంపిక చేశారని, ’అగ్రి స్టాక్‌’ ద్వారా ఆన్‌లైన్‌ యూరియా కేటాయింపులను చేపట్టనున్నట్లు కలెక్టర్‌ ప్రకటించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement