● ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తం
● బూత్ లెవెల్ నేతలతో
దాడిశెట్టి, ద్వారంపూడి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ పేరుతో వైఎస్సార్ సీపీకి చెందిన ఓట్లను తొలగించే కుట్రలను బూత్ స్థాయిలో తిప్పి కొట్టాలని ముఖ్య నేతలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బూత్ స్థాయిలో నేతలు ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కాకినాడ డీ కన్వెన్షన్ సెంటర్‌లో పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్ అధ్యక్షతన సోమవారం బూత్ స్థాయి పార్టీ నేతల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ ఓట్ల తొలగింపులో జరిగే కుట్రలు, కుతంత్రాలను పార్టీలో బూత్ లెవెల్ నాయకులు సమన్వయంతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సూపర్ సిక్స్ హామీల అమలులో విఫలమవ్వడంతో ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. దీనిని అధిగమించేందుకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు, కార్యకర్తల ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరిగే అవకాశముందన్నారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే నెల నుంచి బూత్ స్థాయి అధికారులు తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి ఓటర్ల జాబితాలను పరిశీలిస్తారని చెప్పారు. బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండి పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు. చంద్రబాబు, లోకేష్‌లు కలిసి జగన్‌పై చేస్తున్న దుష్ప్రచారాన్ని పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాకినాడలోని 6, 7, 8, 9, 13, 18, 19, 20, 21, 23, 30, 31, 32, 34, 35 డివిజన్లలో నాయకులు ఓటర్ల జాబితాలను జాగ్రత్తగా పరిశీలించాలని ద్వారంపూడి సూచించారు. జిల్లా టాస్క్ ఫోర్స్ సభ్యులు బీవీఆర్ చౌదరి పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్‌ఏలకు ఎస్‌ఐఆర్ నిర్వహణలో అనుసరించాల్సిన విధానంపై అవగాహన కల్పించారు. పార్లమెంటు పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, కాకినాడ జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు ఒమ్మి రఘురామ్, కాకినాడ టాస్క్‌ఫోర్స్ సభ్యులు బి.వి.ఆర్.చౌదరి, కాకినాడ టాస్క్‌ఫోర్స్ ప్రతినిధి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి జమీలు, పార్టీ మహిళా రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి దీప్తికుమార్, జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, ప్రచార సెల్ ప్రతినిధి రావూరి వెంకటేశ్వరరావు, పార్టీ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి పాల్గొన్నారు.


