● అర్జీలపై స్పందించని అధికారులు
● పదేపదే విన్నవిస్తున్నా పట్టించుకోని వైనం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): పదేపదే తిరుగుతూ తమ సమస్యలను అధికారులకు మొర పెట్టుకున్నా ప్రయోజనం ఉండటం లేదని అర్జీదారులు మండిపడుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు వస్తున్న అర్జీలపై అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌లో ఒక సమస్యపై అనేక పర్యాయాలు తిరుగుతూ అర్జీలు అందజేస్తున్నా పరిష్కారం లభించడం లేదని పలువురు వాపోతున్నారు. కాకినాడ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు అందించేందుకు ప్రజలు పోటెత్తారు. పింఛన్లు, భూసమస్యలు, భూ సర్వే, ప్రభుత్వ పథకాలు అందడం లేదని పలువురు అర్జీలు అందించారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌తోపాటు జిల్లా అధికారులు ప్రజల నుంచి 316 అర్జీలు స్వీకరించారు.


