పాడా పీడీకి వినతి పత్రం అందించిన బాధితులు
పిఠాపురం రూరల్: తమ గూడు తొలగించొద్దని పట్టణ పరిధి ఇందిరానగర్ కాలనీ వాసులు సోమవారం పాడాలో జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో అధికారులను వేడుకున్నారు. అధికారులకు వినతి పత్రం అందించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఇందిరానగర్ శివారున 12 కుటుంబాలకు చెందినవారు 40 సంవత్సరాల పైబడి జీవిస్తున్నారు. వీరు నివసిస్తున్న ఇళ్లకు అధికారులు మున్సిపల్ పన్ను, కుళాయి పన్ను సైతం విధించారు. విద్యుత్ శాఖ కరెంట్ మీటర్ మంజూరు చేసింది. కొద్ది రోజుల క్రితం మున్సిపల్ అధికారులు వచ్చి 30 రోజుల్లోగా ఇళ్లను ఖాళీ చేయాలని లేని పక్షంలో జేసీబీలతో తామే తొలగిస్తామని హెచ్చరించారని బాధితులు వాపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్న తమను అర్ధంతరంగా ఖాళీ చేసి వెళ్లిపొమ్మనడం తగదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థలం సక్రమం కానప్పుడు, ఇంటి పన్ను, కుళాయి పన్ను, కరెంట్ మీటర్ ఎలా వేశారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇల్లు కట్టుకునే స్తోమత లేక పాకలు వేసుకుని జీవిస్తున్నామని, వేరే చోటకు పోవాలంటూ అధికారులు చెప్పడం తగదని, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.


