పీహెచ్‌ఛీ! | - | Sakshi
Sakshi News home page

పీహెచ్‌ఛీ!

May 25 2026 3:28 AM | Updated on May 25 2026 3:28 AM

ఇంకా ఎన్నో...

● జాస్‌ ప్రోత్సాహక నిధులు విడుదలయితే తమలో ప్రతి ఒక్కరి నుంచి రూ.800 చొప్పున వసూలు చేశారని ఓ ఎంఓపై ఎంఎల్‌హెచ్‌పీలు ఆరోపించారు.

● 2024లో పల్స్‌పోలియో ప్రోత్సాహక నిధుల్లో అవకతవకలకు పాల్పడ్డారని అదే పీహెచ్‌సీలోని మరో ఎంఓపై కూడా ఆరోపణలు వచ్చాయి.

● సూపర్‌వైజర్లయిన ఎంపీహెచ్‌ఈఓ, పీహెచ్‌ఎన్‌, ఎంపీహెచ్‌ఎస్‌లు ప్రతి రోజూ ఫీల్డ్‌కు వెళ్లకుండానే ఫీల్డ్‌ టూర్‌ అప్రూవల్‌ (ఎఫ్‌టీఏ) డబ్బులు డ్రా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

● పీహెచ్‌సీ పరిధిలోని 13 మంది ఏఎన్‌ఎంలను ఫీల్డు విజిట్లు చేయనీయకుండా స్టాఫ్‌ నర్సులు తమకు అసిస్టెంట్లుగా వాడుకుంటున్నారని చెబుతున్నారు.

● పీహెచ్‌సీ సేవలు సక్రమంగా లేవంటూ అక్కడి ప్రజలు నేరుగా తిమ్మాపురం ప్రజాదర్బారులో ఫిర్యాదులు చేశారు.

● 24 గంటలూ ఉంచాల్సిన పీహెచ్‌సీని చీకటి పడితే మూసేస్తున్నారని, రాత్రి వేళ డాక్టర్లు లేక సిబ్బందే వైద్యం చేసేస్తున్నారని స్థానిక నాయకులకు, ఉన్నతాధికారులకు చెప్పారు.

● హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్ల అద్దెలను వ్యక్తిగత ఖాతాల్లో జమ చేస్తున్నారనే ఆరోపణలు ఎంఓపై ఉన్నాయి. తక్కువ అద్దెను ఎక్కువగా చూపి మిగిలిన మొత్తాన్ని ప్రయోజనంగా పొందుతున్నారని అంటున్నారు.

● ఓ ఉద్యోగి మద్యం దుకాణంలో మద్యం కొనడాన్ని అక్కడి వారు వీడియో తీసి వైరల్‌ చేశారు. ఇది విధి నిర్వహణ సమయంలోనే అనే ప్రచారం ఉంది.

● పియర్‌ ఎడ్యుకేటర్‌, స్వస్థ నారీ స్వశక్త్‌ పరివార్‌ అభియాన్‌ ప్రోత్సాహకాలు అందలేదని ఈ ఏడాది ఏప్రిల్‌ 2న డీఎంహెచ్‌ఓకు ఎంఎల్‌హెచ్‌పీలు ఫిర్యాదు చేశారు. దీనికి ఎంఓనే కారణమని ఆరోపించారు.

● ఓ పీహెచ్‌సీలో ఇన్ని వివాదాలు చోటు చేసుకోవడం జిల్లాలోనే ఇది తొలిసారని ఉన్నతాధికారులే అంటున్నారు.

‘లెక్క’ లేదు

ఈ నేపథ్యంలో ఈ ఫిర్యాదుపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు జిల్లా ప్రోగ్రామ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ లక్ష్మి తేటగుంట పీహెచ్‌సీలో శనివారం విచారణ నిర్వహించారు. ఎన్‌హెచ్‌ఎం ప్రోత్సాహక నిధులు రూ.3 లక్షల వినియోగంపై లెక్కలు అడిగితే ప్రస్తుత ఎంఓ, ఎల్‌డీసీ నీళ్లు నమిలారని అంటున్నారు. నయాపైసాకు కూడా లెక్క లేదని, ఫర్నిచర్‌, స్టేషనరీ కొన్నామని బిల్లులు చూపించినా అవి సరైనవేననడానికి రుజువు చూపలేకపోయారని చెబుతున్నారు. చివరకు కాస్త సమయం కావాలని కోరడంతో డాక్టర్‌ లక్ష్మి తన విచారణను వాయిదా వేశారు. ఆమె అలా వెళ్లగానే ఎంఎల్‌హెచ్‌పీలను పీహెచ్‌సీకి పిలిపించి, స్టేషనరీ, ఫర్నిచర్‌ ఎప్పుడో కొన్నామని, ఎవరైనా అడిగితే ఇదే చెప్పాలని చెబుతూ సంతకాలు పెట్టించుకున్నారని సిబ్బంది చెబుతున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష (జాస్‌) నిధులతో ఇప్పటికే కొన్నాం కదా.. ఆడిట్‌లో తేడా వస్తుందని చెప్పినా వినకుండా చెప్పింది చేయాలంటూ బలవంతంగా సంతకాలు పెట్టించారని ఆరోపిస్తున్నారు. ఈ పత్రాలనే తదుపరి విచారణలో విచారణాధికారికి సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు.

వివాదాలకు కేంద్ర బిందువుగా

తేటగుంట పీహెచ్‌సీ

ఎన్‌హెచ్‌ఎం నిధుల అవకతవకల

ఆరోపణలపై విచారణ

ఎంఎల్‌హెచ్‌పీలతో రిజిస్టర్‌లో

బలవంతపు సంతకాలు!

వైద్యులు ఉండటం లేదని, సిబ్బందే

వైద్యం చేస్తున్నారని ఫిర్యాదు

పల్స్‌పోలియో ప్రోత్సాహకాల

దుర్వినియోగం పైనా ఆరోపణలు

కాకినాడ క్రైం: ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ) నేడు అనేక వివాదాలకు నెలవుగా మారుతున్నాయి. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం, నిర్వాకం, అవినీతి వెరసి ఆసుపత్రుల ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. తుని మండలం తేటగుంట పీహెచ్‌సీపై వచ్చిన ఆరోపణలే దీనికి తాజా ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఈ పీహెచ్‌సీ పరిధిలోని 25 గ్రామాల్లో 7 సబ్‌ సెంటర్లు, 13 హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్ల ద్వారా సుమారు 50 వేల మంది గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి. పీహెచ్‌సీలో సుమారు 20 మంది, సబ్‌ సెంటర్లు, హెల్త్‌ అండ్‌ వెల్నెస్‌ సెంటర్లలో 70 మంది కలిపి మొత్తం 90 మంది పని చేస్తున్నారు. వీరిలో కొందరి వల్ల వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.

ఇలా బట్టబయలు

తమకు రావలసిన ప్రోత్సాహకాల మొత్తం నేటికీ అందలేదని పూర్వపు మెడికల్‌ ఆఫీసర్‌ (ఎంఓ) ఒకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తేటగుంట పీహెచ్‌సీలో 2023లో ఆమె పని చేసినప్పుడు ఢిల్లీ నుంచి నేషనల్‌ క్వాలిటీ అక్రిడిటేషన్‌ స్టాండర్డ్‌ (ఎన్‌క్యూఏఎస్‌) బృందం వచ్చి, తనిఖీలు చేసి, రాష్ట్రంలోనే ఉత్తమ పీహెచ్‌సీగా గుర్తించింది. దీనికి గాను ఎంఓకు, ఇతర సిబ్బందికి నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ప్రోత్సాహకాలు మంజూరు చేసింది. ఆ మొత్తం మార్చి 16న ప్రస్తుత మెడికల్‌ ఆఫీసర్‌ ఖాతాలో జమ చేశారని, ఆ విషయం ఎవరికీ చెప్పకుండా మోసం చేశారని, సుమారు రూ.3 లక్షలు దుర్వినియోగమయ్యాయనే అనుమానాలున్నాయని కలెక్టర్‌, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ)కి అప్పటి ఎంఓ సహా ఓ మినిస్టీరియల్‌ ఉద్యోగి, శానిటరీ వర్కర్‌ ఈ నెల 14న ఫిర్యాదు చేశారు.

నామమాత్రపు మొత్తంతో సరి

విషయం రచ్చవుతున్న తరుణంలో ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. ఫిర్యాదులు అందాక, డబ్బు వచ్చిన రెండు నెలల తర్వాత ఫిర్యాదీల ఖాతాల్లో నామమాత్రపు మొత్తాన్ని జమ చేశారు. తమకు రావలసిన మొత్తంలో ఇది కేవలం పదో వంతేనని ఎంఓ, సిబ్బంది అటున్నారు. అయితే, వారికిచ్చేవి వీటితో సరి అని అధికారులు చెబుతున్నారు. అదే నిజమైతే తాము ఫిర్యాదు చేసేంత వరకూ డబ్బులు వేయకపోవడం, తోచినంత వేయడమేమిటని ఎంఓ, సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement