● ఓట్లు తొలగించకుండా చూడాలి
● తొలగిస్తే వెంటనే స్పందించాలి
● బూత్ లెవెల్ ఏజంట్లకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా సూచన
శంఖవరం: ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్)పై వైఎస్సార్ సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, అర్హుల ఓట్లు తొలగించకుండా చూడాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. ఈ అంశంపై నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్లకు అన్నవరం కేకే ఫంక్షన్ హాలులో ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సర్ పక్రియపై ఏజెంట్లకు పూర్తి స్థాయి అవగాహన ఉండాలని చెబుతూ ఈ ప్రక్రియను సులభంగా అర్థమయ్యే రీతిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గతంలో చాలా రాష్ట్రాల్లో సర్ ప్రక్రియతో కొంత మంది ఓట్లను తొలగించారని, దీనివలన చాలా మంది ఓటమి పాలయ్యారని చెప్పారు. అర్హుల ఓట్లు తొలగించకుండా సర్‌లో నిబంధనలు పాటించేలా బూత్ లెవెల్ ఏజెంట్లు చూడాలని కోరారు. వారికి ఎప్పటికప్పుడు పార్టీ నాయకులు, కార్యకర్తలు సూచనలు చేయాలని రాజా ఆదేశించారు.
పార్టీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు మాట్లాడుతూ, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా సర్ ప్రక్రియ జరిగితే, వెంటనే పార్టీ నేతలకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ, క్షేత్ర స్థాయిలో బూత్ లెవెల్ ఏజెంట్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ బూత్‌ల పరిధిలోని ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఇతర పార్టీలు ఎటువంటి అక్రమాలకూ పాల్పడకుండా ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు ఒమ్మి రఘురాం మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైదని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేస్తోందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జోన్–2 బూత్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీవీఆర్ చౌదరి, తుని నియోజకవర్గ పరిశీలకుడు వాసిరెడ్డి జమీల్, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, జెడ్పీటీసీ సభ్యులు గొల్లు చిన్నదివాణం, బెహరా రాజరాజేశ్వరి దొరబాబు, మండల కన్వీనర్లు నరాల శ్రీను, రామిశెట్టి నాని, చింతకాయల సత్యనారాయణ, శిఘడం వెంకటేశ్వరరావు, గొల్లపల్లి సురేష్, పార్టీ నాయకులు శెట్టిబత్తుల కుమార్‌రాజా, వాసిరెడ్డి భాస్కరబాబు, వైఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి అడపా సోమేష్, బదిరెడ్డి గోవింద్, గొల్లపల్లి కాశీ, గౌతు స్వామి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, వైఎస్సార్ సీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు.
సదస్సులో మాట్లాడుతున్న దాడిశెట్టి రాజా
హాజరైన బీఎల్‌ఏలు, పార్టీ నాయకులు


