టెట్‌పై టీచర్ల ఫైట్‌ | - | Sakshi
Sakshi News home page

టెట్‌పై టీచర్ల ఫైట్‌

May 25 2026 3:28 AM | Updated on May 25 2026 3:28 AM

అమలాపురం టౌన్‌: టెట్‌పై ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాలన్నీ ఫైట్‌ చేస్తున్నాయి. 2010 ముందు ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందిన వారిని టెట్‌ నుంచి మినహాయించాలనేది వారి ప్రధాన డిమాండ్‌. టెట్‌ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు, విద్యా శాఖ మంత్రి లోకేష్‌లు సానుకూలంగా ఇచ్చిన హామీని ఉపాధ్యాయులు విశ్వసించడం లేదు. సూపర్‌ సిక్స్‌, పీ–4 హామీల మాదిరిగానే టెట్‌ హామీని కూడా గాలికొదిలేస్తారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు దశాబ్దాలుగా ఉపాధ్యాయ ఉద్యోగం చేస్తున్న తమకు ఈ వయసులో అర్హత పరీక్ష ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 2010లో ఆర్‌టీఐ చట్టం వచ్చింది. అంతకుముందు నియామకాలు పొందిన ఉపాధ్యాయులను ఈ చట్టం నుంచి మినహాయించాలన్నది వారి మరో డిమాండ్‌. 2025 సెప్టెంబర్‌ 1న సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులందరూ టెట్‌ రాయాల్సిందేనని పేర్కొంది. అయితే ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందేనని ఉపాధ్యాయ సంఘాలు గట్టిగా పట్టుబడుతున్నాయి. ఈ మేరకు పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

టీచర్లు మళ్లీ విద్యార్థులుగా మారాలి!

ఉమ్మడి జిల్లాలో దాదాపు 18 వేల మంది ఉపాధ్యాయులున్నారు. టెట్‌ నిబంధనల మేరకు వీరిలో దాదాపు 7 వేల మందికి పైగా ఈ పరీక్ష రాసి నైపుణ్యాన్ని పరీక్షించుకోవాల్సిందే. దాదాపు 16 ఏళ్ల కిందట ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులు ఇప్పుడు టెట్‌ ఉత్తీర్ణులు కావడం కష్టమే. 150 మార్కులకు నిర్వహించే టెట్‌లో ఉత్తీర్ణత పొందాలంటే ఓసీ, బీసీ, ఎస్సీలు 50 నుంచి 90 శాతం మార్కులు తెచ్చుకుంటేనే కానీ ఈ గండం నుంచి గట్టెక్కలేరు. టెట్‌ పేపర్‌–1లో తెలుగు, ఇంగ్లిషు, గణితం, పర్యావరణం, శిశు సంరక్షణలకు చెందిన సబ్జెక్టుల కోసం ఉపాధ్యాయులు మళ్లీ విద్యార్థులుగా మారాలి. పేపర్‌–2లో బయో సైన్స్‌ ఉపాధ్యాయులు లెక్కలు, తెలుగు పండితులు సాంఘిక శాస్త్రం పేపర్లు విధిగా రాయాలి. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదు. టెట్‌ పాసైతేనే ఆ ఉపాధ్యాయులకు పదోన్నతులు, రిటైర్మెంట్‌ బెనిఫిట్లు ఉంటాయన్న నిబంధనపై కూడా ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు మానసిక ఆందోళనకు గురవుతున్నప్పటికీ ప్రభుత్వం నోరు మెదపకపోవడంపై గురువులు గుర్రుగా ఉన్నారు.

ఉపాధ్యాయులను

ఇబ్బంది పెడుతున్న నిబంధన

టెట్‌ పాసైతేనే పదోన్నతులు, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్లు ఉంటాయని మెలిక

2010కి ముందు ఇన్‌ సర్వీస్‌ ఉన్నవారిని మినహాయించాలని డిమాండ్‌

Advertisement
 
Advertisement
Advertisement