● ఆ దిశగా చర్యలు
● ఏపీ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు
కాకినాడ రూరల్: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర పరిశ్రమ సేవలను విస్తృతపరిచేందుకు చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి (ఏపీ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్) అధ్యక్షుడు అంబటి మధుమోహన్‌కృష్ణ, ఉపాధ్యక్షుడు పీవీఎస్ వర్మ, కార్యదర్శి మోహన్‌గౌడ్ తెలిపారు. వాకలపూడిలోని క్షత్రియ ఫంక్షన్ హాలులో ఆదివారం జరిగిన చాంబర్ సమావేశాన్ని మధుమోహన్‌కృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సినిమా బాగా ఆడేందుకు బడ్జెట్‌తో పని లేదని, చిన్న చిత్రాలు సైతం విజయం సాధిస్తున్నాయని అన్నారు. అయితే, శంకరాభరణం వంటి హృదయానికి హత్తుకునే చిత్రాలు మాత్రం రావడం లేదని చెప్పారు. మంచి కంటెంట్ ఉంటే ఏ చిత్రమైన ప్రేక్షకులను రంజింపజేస్తుందన్నారు. రాష్ట్రంలో చిత్ర పరిశ్రమపై మక్కువ ఉన్న కళాకారులను ప్రోత్సహిస్తామన్నారు. మోహన్‌గౌడ మాట్లాడుతూ, ఏపీలో చలనచిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు చాంబర్ తరఫున జిల్లాలకు కో ఆర్డినేటర్లను నియమిస్తున్నామని చెప్పారు. సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉన్న కళాకారులు తమకు వివరాలు అందజేస్తే వాటిని వెబ్‌సైట్‌లో ఉంచుతామని, వారికి అవకాశాలు వచ్చే చాన్స్ ఉంటుందని అన్నారు. వర్మ మాట్లాడుతూ, ఎస్‌వీఆర్, సూర్యకాంతం, అంజలి, రావు గోపాలరావు వంటి గొప్ప కళాకారులు ఈ ప్రాంతానికి చెందినవారేనని గుర్తు చేశారు. దర్శకుడు సలాది సత్య మాట్లాడుతూ, తనది కాకినాడ జిల్లా ఉండూరు గ్రామమని, గ్రామీణ నేపథ్యంతో సినిమాలు తీయడంతో పాటు స్థానిక కళాకారులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఆ విధంగానే ‘బెట్టింగ్ గ్యాంగ్ ఆఫ్ కాకినాడ’ సినిమా తీస్తున్నామని తెలిపారు. అనంతరం కో ఆర్డినేటర్లను ప్రకటించారు. చాంబర్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కో ఆర్డినేటర్లుగా సలాది శ్రీనివాసబాబు, కోటిపల్లి బుజ్జి, హిందూపురం కో ఆర్డినేటర్‌గా వెంకటేష్‌రెడ్డిలను నియమించారు. చాంబర్ సంయుక్త కార్యదర్శి పీడీఆర్ ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యాన దర్శకుడు సత్య సలాది అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తొలుత చిన్నారులు ప్రదర్శించిన శాసీ్త్రయ నృత్యాలు అందరినీ అలరించాయి. అలాగే, కాకినాడకు చెందిన ఆర్టిస్ట్ వెంకన్నబాబు చిరంజీవి డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు.
సమావేశాన్ని ప్రారంభిస్తున్న చాంబర్ అధ్యక్షుడు మధుమోహన్‌కృష్ణ


