బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): స్థానిక సూర్య కళా మందిరంలో గజల్ శ్రీనివాస్ ఆలపించిన గజల్స్, భక్తి గీతాలు అందరినీ అలరించాయి. సరస్వతీ గానసభ, గజల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన తెలుగు గజల్స్ లెజెండ్, గిన్నిస్ ప్రపంచ రికార్డులు సాధించిన మాస్ట్రో గజల్ శ్రీనివాస్‌చే 40 వసంతాల గజల్ గాన ఉత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని శ్రీనివాస్‌తో పాటు సరస్వతీ గానసభ జీవితకాల అధ్యక్షుడు కొమ్మిరెడ్డి శ్రీరామనరసింగరావు, గౌర వాధ్యక్షురాలు పెద్దాడ సూర్యకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యకుమారి మాట్లాడుతూ, 40 సంవత్సరాలు గా తన గజల్స్‌తో నిర్విరామంగా తెలుగు ప్రేక్షక శ్రోతలను మైమరపింపజేయడం శ్రీనివాస్‌కే సాధ్యమన్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ, 125 సంవత్సరాలుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న, తెలుగు వారు గర్వించదగిన సరస్వతీ గానసభలో గజల్స్ ఆలపించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.
లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
కోదాడ రూరల్: ముందు వెళ్తున్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం శ్రీరంగాపురం బైపాస్ వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి యోలో ట్రావెల్స్ బస్సు 36 మంది ప్రయాణికులతో శనివారం రాత్రి హైదరాబాద్‌కు బయల్దేరింది. ఆదివారం తెల్లవారుజామున కోదాడ సమీపాన బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బస్సు ముందు సీట్లలో కూర్చున్న ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వారు హైదరాబాద్, విజయవాడ వెళ్లారు.
తప్పిన ప్రమాదం
దేవీపట్నం: పాపికొండలు పర్యాటకులకు పెను ప్రమాదం తప్పింది. దేవీపట్నం మండలం గండిపోశమ్మ ఆలయం వద్ద పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన బోటుకు ముందు భాగంలో పగులు ఏర్పడటంతో నీరు లోపలకు చేరింది. 40 మంది సామర్థ్యం ఉన్న ఈ బోటు పర్యాటకులతో తిరుగుతుంటుంది. ఈ బోటులో వెళ్లేందుకు 38 మంది ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. వారంతా ఆదివారం ఉదయం గండిపోశమ్మ ఆలయం వద్ద బోట్ పాయింట్ వద్దకు చేరుకున్నారు. అయితే బోటులోకి నీరు చేరడాన్ని సిబ్బంది గుర్తించి ముందుగా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు స్పందించి వేరే బోటులో పర్యాటకులను పంపించారు.


