తలుపులమ్మ తల్లి భక్తులకు ‘ఆన్‌లైన్‌’ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

తలుపులమ్మ తల్లి భక్తులకు ‘ఆన్‌లైన్‌’ కష్టాలు

May 25 2026 3:28 AM | Updated on May 25 2026 3:28 AM

తుని రూరల్‌: లోవ దేవస్థానంలో ఆన్‌లైన్‌ చెల్లింపుల వ్యవస్థ ఏర్పాటుతో.. తలుపులమ్మ తల్లిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు నానా అవస్థలూ పడుతున్నారు. వివిధ జిల్లాల నుంచి ఆదివారం 23 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. వీరందరూ పూజా టికెట్లు, ప్రసాదాలు, ఇతర సేవలకు ఆన్‌లైన్‌లోనే డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఈ క్రమంలో పలుమార్లు విద్యుత్‌, ఇంటర్నెట్‌ మొరాయించడంతో ఆన్‌లైన్‌ సేవలకు పదేపదే అంతరాయం ఏర్పడింది. సమస్యను సిబ్బంది కొంత మేర పరిష్కరించినా.. గ్రా మీణ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇబ్బంది పడ్డారు. కొంత మందికి స్మార్ట్‌ ఫోన్లు లేకపోవడం, మరి కొంత మంది ఫోన్లలో నెట్‌ సిగ్నల్స్‌ సక్రమంగా లేకపోవడంతో అవస్థలు ఎదురయ్యాయి. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడినా కియోస్కులు పని చేసేలా యూపీఎస్‌లు ఏర్పాటు చేశామని దేవస్థానం ఈఓ పి.విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,13,448, పూజా టికెట్లకు రూ.3,67,702, కేశఖండన శాలకు రూ. 19,520, వాహన పూజలకు రూ.4,370, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.86,865, విరాళాలు రూ.13,992 కలిపి మొత్తం రూ.7,03,897 ఆదాయం సమకూరిందని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement