సాక్షి, రాజమహేంద్రవరం: భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యా ప్తంగా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వ రకు తన విశ్వరూపం చూపుతున్నాడు. ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దీనికి వడగాలులు తోడై ప్రాణాలు తోడేస్తున్నాయి. ఐదు రోజులుగా ఈ పరిస్థితి మరింత ఎక్కువై గరిష్టంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 50 మందికి పైగా వడదెబ్బతో మృతి చెందినట్టు సమాచారం.
గతంలో ఎన్నడూ లేనంతగా..
కొన్నేళ్ల గణాంకాలు పరిశీలిస్తే నమోదవుతున్న ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీల లోపే. ఈ ఏడాది భానుడు ప్రచండుడైపోయాడు. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయని నిపుణలు వెల్లడిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్, మొక్కలు పెంచకపోవడం, ఉన్నవాటిని నరికేయడం తదితర కారణాలు ఇందుకు ప్రధాన కారణమని వారంటున్నారు. పచ్చని చెట్ల స్థానే లే అవుట్లు వేయడం, ఇటుక బట్టీలకు కలపగా వినియోగించడం కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయంటున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు భీతిల్లుతున్న ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఇళ్లకే పరిమితమవుతున్నారు. సాయంత్రం 7 గంటల వరకు వేడి కొనసాగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం 30 డిగ్రీలు నమోదవుతున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని పనివారు డీహైడ్రేషన్‌కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు.
ఉపశమన చర్యలు శూన్యం
ఈ విపత్కర పరిస్థితుల్లో ఉపశమన చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని ప్రదేశాల్లో కూలీలకు తాగునీటి సదుపాయం కల్పించాలని గ్రామీణాభివృద్ధి శాఖ ఈ నెల ఒకటో తేదీన ఆదేశాలు జారీ చేసింది. క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఆ పరిస్థితి లేదు.
జీజీహెచ్‌కు బాధితులు
కాకినాడ, రాజమండ్రి, కోనసీమ జిల్లాల్లోని ప్రభుత్వ వైద్య శాలలకు వడదెబ్బ బాధితులు క్యూ కడుతున్నారు. ఐదు రోజులుగా డీహైడ్రేషన్, త లనొప్పి, నీరసం సమస్యలతో వ స్తున్న రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉమ్మడి జిల్లాలో రోజుకు 300 మందికి పైగా ఇలా వైద్యులను ఆశ్రయిస్తున్నారు. 30 మందికి పైగా ఇన్‌పేషెంట్లుగా చేరుతున్నారు.
నిర్థారణ ఇలా..
● వడదెబ్బ మృతిగా నిర్థారించాలంటే సదరు మృతుని సంబంధీకులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.
● మృతదేహానికి తప్పనిసరిగా పోస్టుమార్టం నిర్వహించాలి. రెవెన్యూ అధికారుల శవ పంచనామా, మధ్యవర్తుల రిపోర్టు పోలీసు విచారణ వంటివి జరిపి నిర్థారించాలి.
● వడదెబ్బతో మృతి చెందినవారికి అంతిమ సంస్కారం చేస్తున్నారు తప్ప పోలీసు ఫిర్యాదును విస్మరిస్తున్నారు.
● గతంలో ప్రభుత్వం నిబంధనలు సడలించి వైద్యాధికారి, పోలీసు సబ్ ఇన్స్‌పెక్టర్, తహసీల్దార్లతో త్రిసభ్య కమిటీ నియమించింది. ఆ కమిటీలు దరఖాస్తులను పరిశీలించి మృతుల ఇళ్లకు వెళ్లి నిర్థారించాల్సి ఉంది.
● వాటిని కలెక్టరేట్‌కు నివేదిస్తే ఆ మేరకు ప్రభుత్వం పరిహారం నిధులు విడుదల చేస్తుంది.
● కానీ ఈ ఏడాది ప్రభుత్వం నిర్థిష్ట ప్రకటన చేయకపోవడంతో ఫిర్యాదులు లేక సంబంధిత నిధుల విడుదలలో సైతం మొండి చేయి చూపుతున్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గత నాలుగు రోజులుగా డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇలా..
వారం కనిష్టం గరిష్టం
మంగళవారం 37 45
బుధవారం 37 45
గురువారం 39 46
శుక్రవారం 39 46
శనివారం 37 45
నిడదవోలు రూరల్ మండలానికి చెందిన గారపాటి ధర్మతేజ (24) వడదెబ్బతో శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందారు. ఉష్ణోగ్రతలతో అస్వస్థతకు గురికావడంతో అతని కుటుంబ సభ్యులు నిడదవోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు ఎన్నో తలెత్తుతున్నాయి.
కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గ సర్పవరం గ్రామానికి చెందిన గుర్రం అప్పన్న పారిశుద్ధ్య కార్మికుడు. విధి నిర్వహణలో ఉండగా ఎండ వల్ల అస్వస్థతకు గురయ్యాడు. హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. అతడి మృతితో కుటుంబలో విషాదం నెలకొంది.
అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో పిట్టల్లా రాలుతున్న జనం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా
వ్యాప్తంగా ఇదే పరిస్థితి
వడదెబ్బకు పదుల సంఖ్యలో మరణాలు
పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం
ఉపశమన చర్యలు శూన్యం


