తాళ్లపూడి: గోదావరి ఏటిగట్టు రోడ్డుపై జారి పడిన ఇసుకను రెవెన్యూ అధికారులు తొలగించారు. రోడ్లపై పడుతున్న ఇసుక వల్ల వాహన చోదకులు పడుతున్న ఇబ్బందులపై శనివారం సాక్షిలో ప్రచురితమైన ‘లారీల జోరు.. ప్రయాణికుల బేజారు’ కథనంపై స్పందించి తహసీల్దార్ లక్ష్మీ లావణ్య యుద్ధ ప్రాతిపతికన చర్యలు చేపట్టారు. ఇసుక రవాణా లారీల రాకపోకల్లో వాటి నుంచి పడుతున్న ఇసుక ప్రమాదాలకు కారణమవుతోంది. దీంతో తాడిపూడి, పైడిమెట్ట, ప్రక్కిలంక తదితర గోదావరి ఏటిగట్లపై పడిన ఇసుకను అధికారులు తొలగిస్తున్నారు.
దివ్యాంగుల గ్రీవెన్స్‌కు
62 అర్జీలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని దివ్యాంగుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం శనివారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ ప్రజావాణి హాలులో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. కలెక్టర్ హరేంధిరప్రసాద్, డీఆర్వో డాక్టర్ టి.తిప్పెనాయక్, విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడి శ్రీనివాసులు హాజరై దివ్యాంగుల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. పెన్షన్లు, గృహం, సహాయ పరికరాల మంజూరు, విద్య, ఉపాధి, ఆరోగ్య సేవలు తదితర అంశాలపై 62 అర్జీలు అందాయి. వాటిని సంబంధిత శాఖలకు పంపి సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రజల భాగస్వామ్యంతో
‘క్లీన్ స్వీప్’
బోట్‌క్లబ్ (కాకినాడసిటీ): నగర సుందరీకరణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ హరేంధిరప్రసాద్ అన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్ పరిధిలో పరిసరాల పరిశుభ్రతను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్థానిక గాంధీనగర్‌పార్కులో శనివారం ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాబోయే నాలుగు వారాల పాటు ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని, ఇది విజయవంతం కావడానికి ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
మరోసారి పెట్రో పిడుగు
తాజాగా 97 పైసలు పెంపు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కేంద్ర ప్రభుత్వం శనివారం మరోసారి పెట్రో ధరలు పెంచింది. తాజాగా 97 పైసలు పెంపుతో ప్రజలపై పెనుభారం పడనుంది. గడిచిన 13 రోజుల వ్యవధిలో పెట్రో ధరలు పెరగడం ఇది మూడోసారి. జిల్లాలో లీటరు పెట్రోలు రూ.110.05 ఉండేది. అది కాస్తా రూ.3.29 పెంపుతో లీటరు రూ.113.34 అయ్యింది. తాజా పెంపుతో లీటరు రూ.115.08కు చేరింది. డీజిల్ సైతం తాజా పెంపుతో రూ.102.72కు పెరిగింది.
ఆకట్టుకున్న ‘లయ విన్యాసం’
ముగిసిన త్యాగరాజ సమితి అమృతోత్సవం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితిలో పెరవలి జయభాస్కర్ బృందం లయ విన్యాసం ఆకట్టుకుంది. సమితి 75 వసంతాల సందర్భంగా స్థానిక గోదావరి గట్టున గల సమితి ప్రాంగణంలోని ఏసీ ఆడిటోరియంలో 18 రోజుల పాటు సాగిన కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. చివరిరోజు శనివారం సాయంత్రం పెరవలి జయభాస్కర్ బృందంచే లయ విన్యాసం పేరిట వాద్య సమ్మేళనం హృద్యంగా సాగింది. కళాకారులు, కార్యవర్గంతో కలిసి మహా మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి జ్యోతి ప్రకాశనం చేశారు. విశ్వనాథం భాస్కర రామ్, వాడ్రేవు వెంకట రమణారావు, సీఎస్ వెంకట్రావు, జోస్యుల సరస్వతి, వక్కలంక శ్రీరామచంద్రం, వి.కృష్ణకుమారి తదితర సమితి కార్యవర్గం పర్యవేక్షించింది.
శ్రీనివాసా.. శ్రీవేంకటేశా
ఆత్రేయపురం: భానుడు ఉగ్రరూపం దాల్చినా.. భక్తిభావం సడలలేదు.. ఆ శ్రీనివాసుని దర్శనానికి భక్తజనం క్యూ కట్టింది. వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానం శనివారం కిక్కిరిసింది. సుమారు 80 వేల నుంచి లక్ష వరకూ వచ్చినట్లు ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. తెల్లవారుజాము నుంచే రద్దీ నెలకొంది.


