సామర్లకోట: స్థానిక కుమ్మరి వీధికి చెందిన వ్యవసాయ కూలీ లోడ సతులు (55) వడగాడ్పులకు గురై శుక్రవారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు పనికి వెళ్లిన సతులు ఇంటికి వచ్చిన వెంటనే కుప్పకూలిపోయాడని, వెంటనే అతడిని మంచంపై పడుకొపెట్టి సేద తీరుస్తుండగా కొంత సేపటికే మృతి చెందాడని వారు తెలిపారు. సుమారు ఐదేళ్ల క్రితమే కుమారుడు చనిపోవడంతో కోడలు గంగ, భార్య చంద్ర, మనవడు సాత్విక్‌లను సతులే పోషిస్తున్నాడు. అతడి మృతితో ఆ కుటుంబానికి ఆధారం లేకుండా పొయింది. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ ఐటీ వింగ్ పట్టణ అధ్యక్షుడు దర్శిపాటి సత్యానందం డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డికి వినతి పత్రం అందజేసినట్టు దర్శిపాటి తెలిపారు.
కొత్త సూరవరంలో..
తుని రూరల్: ఎస్.అన్నవరం పంచాయతీ కొత్త సూరవరం గ్రామానికి చెందిన తోట యేసుబాబు (40) వడగాడ్పునకు గురై మృతి చెందినట్టు వీఆర్వో సత్యవతి శనివారం తెలిపారు. ఆమె తెలిపిన వివరాల మేరకు యేసుబాబు శుక్రవారం పనికి వెళ్లి వచ్చి ఇంటి వద్ద రాత్రి ఎనిమిది గంటల సమయంలో నీరసించి సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే తుని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే1 మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించాన్నారు. యేసుబాబుకు భార్య, కుమారుడు, కుమార్తె, తండ్రి ఉన్నారు.


