నాలుగు నెలలుగా అందని జీతాలు | - | Sakshi
Sakshi News home page

నాలుగు నెలలుగా అందని జీతాలు

May 23 2026 12:28 AM | Updated on May 23 2026 12:28 AM

తుని రూరల్‌: నాలుగు నెలలుగా జీతాలు అందకపోవడంతో ఎస్‌.అన్నవరం మేజర్‌ పంచాయతీలో పని చేస్తున్న 25 మంది పారిశుధ్య కార్మికులు అల్లాడిపోతున్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ సమస్యపై కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. పని చేస్తేనే కానీ పూట గడవని తమకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, దీంతో, కుటుంబాన్ని పోషించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు అందకపోయినా మండుటెండలో సైతం పారిశుధ్య పనులు చేస్తున్నామని చెప్పారు. తమ సమస్యను వారం రోజుల్లో పరిష్కరిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారని కార్మికులు తెలిపారు.

జూలై నెలాఖరుకు

నాట్లు పూర్తి చేయాలి

కరప: ఎల్‌నినో ప్రభావంతో వచ్చే ఖరీఫ్‌లో 18 నుంచి 20 శాతం వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశముందన్న వాతావరణ శాఖ అంచనాకు అనుగుణంగా.. వరి సాగులో జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ శాఖ జిల్లా సంయుక్త సంచాలకుడు (జేడీ) ఎన్‌.విజయ కుమార్‌ రైతులకు సూచించారు. కూరాడ, వేములవాడ గ్రామాల్లో శుక్రవారం పర్యటించిన ఆయన రైతులతో సమావేశమై పలు సూచనలిచ్చారు. జూలై నెలాఖరుకల్లా వరి నాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. వాతావరణం వేడిగా ఉన్నందు వల్ల వరి సాగులో వెదజల్లే విధానం వెళ్లకపోవడమే మంచిదని చెప్పారు. స్వర్ణ (ఎంటీయూ–7626) రకానికి ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఎంటీయూ–1318 రకం విత్తనాన్ని ఈ ఖరీఫ్‌లో వేయవద్దని విజయ కుమార్‌ సూచించారు. కార్యక్రమంలో ఎంఏఓ ఇమ్మిడిశెట్టి సత్య పాల్గొన్నారు.

‘పద్మావతి’ పనితీరుపై పరిశీలన

తొండంగి: రత్నగిరిపై శానిటరీ కాంట్రాక్ట్‌ నిర్వహిస్తున్న పద్మావతి హాస్పిటాలిటీ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌పై పారిశుధ్య సిబ్బంది నుంచి పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ‘ఇలాగైతే ఎలా పద్మావతీ!’ శీర్షికన ‘సాక్షి’ శుక్రవారం ప్రచురించిన కథనానికి అన్నవరం దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్పందించారు. పారిశుధ్య పనుల నిర్వహణకు ఆ సంస్థ సక్రమంగా మెటీరియల్‌ ఇవ్వడం లేదని, ఇబ్బందులపై ప్రశ్నిస్తే తొలగిస్తామంటూ బెదిరిస్తోందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు సత్రాల్లోని రూముల్లో ఏర్పాటు చేస్తున్న బెడ్‌షీట్లు, దుప్పట్లు, ఇతర మెటీరియల్‌ను ఈఓ స్వయంగా పరిశీలించారు. అవి శుభ్రంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటరీ సూపర్‌వైజర్‌, అధికారుల పర్యవేక్షణ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మావతి సంస్థ ఏర్పాటు చేసిన వాషింగ్‌ మెషీన్లు పని చేయడం లేదని శానిటరీ అధికారులు బదులిచ్చారు. దీంతో, సంస్థ నిర్వహణ తీరుపై ఈఓ ఆగ్రహం వ్యక్తం చేస్తూ శాఖాపరంగా నోటీసులు ఇచ్చి, చర్యలు తీసుకోవాలని కింది స్ధాయి అధికారులను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement