కాకినాడ రూరల్: రాష్ట్ర పరిస్థితులపై వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పలేకనే ఆయనపై మాటల దాడికి పాల్పడుతున్నారని ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి అన్నారు. జగన్ వ్యాఖ్యలపై మంత్రులు స్పందించాలని శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జగన్ వ్యాఖ్యల్లో తప్పులుంటే చెప్పాలని, వాటికి సమాధానం చెప్పే ధైర్యం లేకనే తమకు అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్ అమలు చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆత్మ క్షోభించేలా టీడీపీని చంద్రబాబు తన వశం చేసుకున్నారని, కాపు నేత వంగవీటి రంగాను హత్యా రాజకీయాలకు వాడుకుని ప్రయోజనం పొందారని, తనకు లబ్ధి లేకపోతే చంద్రబాబు ఏ పనీ చేయరని విమర్శించారు. జగన్ విమర్శలు వాస్తవం కాదా అని ఆమె ప్రశ్నించారు. వాటిపై స్పందించకుండా మంత్రులు వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దిగజారుడుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్‌కు సంబంధం ఉందని నిరూపించేందుకు ఎన్నో విధాల చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడంతో చివరకు ఆయన కుటుంబంలోనూ చిచ్చు పెట్టారని ఆక్షేపించారు. రాష్ట్ర హోం మంత్రి అనిత సొంత నియోజకవర్గంలో బాలికపై అఘాయిత్యం జరగడం బాధాకరమని, గడచిన రెండు మూడు నెలల్లో ఇటువంటి ఘటన రెండోసారి జరిగిందని పేర్కొన్నారు. శాంతిభద్రతలను కాపాడటంలో ఆమె విఫలమయ్యారని ధ్వజమెత్తారు. మారుమూల గ్రామాల్లో సైతం 24 గంటలూ మద్యం ఏరులై పారుతోందని, ఆ మత్తులో ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నిద్రమత్తు వీడకపోవడం విచారకరమని అన్నారు. కొవ్వూరు వంతెన వద్ద బైపాస్‌లో జరిగిన ప్రమాదానికి డ్రైవర్ అతిగా మద్యం సేవించడమే కారణమని అక్కడి కూలీలే చెబుతున్నారన్నారు. మట్టి, ఇసుక, గ్రావెల్ దోచుకుని చినబాబుకు వాటాలు పంపిణీ చేసే ప్రక్రియలో ఎమ్మెల్యేలు బిజీగా ఉన్నారని ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో మట్టి మాఫియా ధనదాహానికి యువకుడు బలయ్యాడని గుర్తు చేశారు. ఇటువంటి పరిస్థితులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం చలనం లేకుండా వ్యవహరిస్తోందని నాగమణి విమర్శించారు.
జెడ్పీలో పలువురికి
ఉద్యోగోన్నతులు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతులు కల్పిస్తూ జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు శుక్రవారం నియామక పత్రాలు అందజేశారు. ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు పరిపాలనాధికారులుగా, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించామని వివరించారు. అలాగే, జెడ్పీ యాజమాన్యంలో పని చేస్తూ అకాల మరణం చెందిన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామక పత్రాలను కూడా ఆయన అందజేశారు. ఉద్యోగోన్నతి పొందిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, జిల్లా పరిషత్‌కు మంచి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు.


