హామీలు నెరవేర్చకుండా జగన్‌పై ఆరోపణలా? | - | Sakshi
Sakshi News home page

హామీలు నెరవేర్చకుండా జగన్‌పై ఆరోపణలా?

May 23 2026 12:28 AM | Updated on May 23 2026 12:28 AM

యనమలపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్‌

తుని రూరల్‌: ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ పథకాలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తామన్న హామీలు, విద్య, వైద్యం, అమరావతిలో అవినీతిపై సమాధానం చెప్పాలంటూ వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రెస్‌మీట్‌లో అడిగితే.. సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దాడికి దిగడమేమిటని టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడిని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. తుని మండలం ఎస్‌.అన్నవరం శివారు సాయి వేదికలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. వైఎస్‌ జగన్‌ విలేకర్ల సమావేశంలో చెప్పిన అంశాలపై యనమల విమర్శించడాన్ని ఖండించారు. ‘వివేకం’ సినిమా చూస్తే జగన్‌ ఎంత చెడ్డవారో అర్థమవుతుందని యనమల అంటున్నారని, ఈ వయస్సులో ఆ సినిమాను ప్రమోట్‌ చేయడం ఆయనకు అవసరమా అని రాజా ప్రశ్నించారు. సినిమాలే ప్రామాణికం అనుకుంటే గతంలో సూపర్‌స్టార్‌ కృష్ణ మీ నాయకుల గురించి ఎన్నో సినిమాలు తీశారని గుర్తు చేశారు. వంగవీటి మోహన రంగా, వంగవీటి రాధ జీవిత చరిత్రపై ‘చైతన్య రథం’ అనే సినిమా తీశారని చెప్పారు. ఆ సినిమాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు సూపర్‌ హిట్‌ చేశారన్నారు. అది మీ జాత్యహంకారం మీద తీసిన సినిమా అని అన్నారు. అటువంటి సినిమా ప్రింట్లను దహనం చేసిన పరిస్థితులు ప్రజలకు తెలుసని చెప్పారు. రాష్ట్రంలో ఒక పెత్తందారీ వ్యవస్థ ఆ ప్రింట్లన్నీ అందుబాటులో లేకుండా చేసిందని మండిపడ్డారు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకోవడం ఇదేనన్నారు. ‘అసెంబ్లీ రికార్డులు చూడండి. తన ప్రాణానికి హాని ఉందని వంగవీటి మోహన రంగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని గుర్తుచేశారు. ఆ అంశం ఈ రోజుకూ అసెంబ్లీ రికార్డుల్లో ఉందన్నారు. ‘యనమలా.. ఆ రోజు మీరు అసెంబ్లీలోనే ఉన్నారు కదా. రంగా సోదరుడు రాధాను పొట్టను పెట్టుకున్నారు. రంగా గారినీ వదల్లేదు’ అని మండిపడ్డారు. ధైర్యం ఉంటే జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడిన దానికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆ పని మాని వెన్నుపోటు పొడిచారని, జగన్‌ జీన్స్‌ గురించి, ఆయన వ్యక్తిగత విషయాలు మాట్లాడతారా అని ప్రశ్నించారు. మరి మన జీన్స్‌ ఏమిటో కూడా చెప్పాలని ఎద్దేవా చేశారు. ‘మీ వ్యక్తిగత చరిత్ర అంత పరిశుభ్రంగా ఉందా? మీ సోదరుడితో 40 ఏళ్లు అన్ని రకాల సేవలు, ప్రతి పనికిమాలిన పనీ చేయించుకున్నారే.. రెండుసార్లు మీ టీడీపీ తరఫున పోటీ చేయించి ఓడిపోయిన తర్వాత వెన్నుపోటు పొడవలేదా?’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో దుర్మార్గమైన పరిపాలన జరుగుతోందని, టీడీపీ కార్యకర్తలను, నాయకులను చక్కదిద్దుకోవాలని రాజా హితవు పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement