● ఎదురెదురుగా రెండు మోటారు సైకిళ్ల ఢీ
● సంఘటన స్థలంలో ఒకరు..
చికిత్స పొందుతూ మరొకరి మృతి
సామర్లకోట: అతి వేగం.. ఆపై హెల్మెట్ ధరించకపోవడం ఇద్దరు ద్విచక్ర వాహనచోదకుల ప్రాణాలను బలి తీసుకుంది. పెద్దాపురం సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ కథనం ప్రకారం.. కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం కోట గ్రామానికి చెందిన తిరుకోట సుధీర్‌రాజు (25) జగ్గంపేటలోని బజాజ్ షోరూములో సర్వీస్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మోటార్ సైకిల్‌పై గండేపల్లికి చెందిన లావణ్య అనే యువతితో కలసి శుక్రవారం జగ్గంపేట నుంచి పెద్దాపురం వస్తున్నాడు. అదే సమయంలో జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన దండ్రు నేరియ్య (28) పెద్దాపురం నుంచి స్వగ్రామం వెళ్తున్నాడు. వీరిద్దరి బైక్‌లు పెద్దాపురం – జగ్గంపేట రోడ్డులో జె.తిమ్మాపురం సమీపంలోని నెక్కంటి సీఫుడ్స్ ఎదురుగా ఉన్న రహదారిలో ఎదురెదురుగా అతి వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుధీర్‌రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన నేరియ్యను పెద్దాపురం సీహెచ్‌సీకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సుధీర్‌రాజు మోటార్ సైకిలు వెనుక కూర్చున్న లావణ్యకు ఎటువంటి గాయాలూ తగల్లేదని సీఐ తెలిపారు. ఈ ప్రమాదంపై ఎస్సై వి.మౌనిక కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వీరిద్దరి మరణాలకు అతి వేగం, హెల్మెట్లు ధరించకపోవడమే కారణమని స్థానికులు చెబుతున్నారు.
కొనసాగిన సప్లిమెంటరీ పరీక్షలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీలో రెండో రోజైన శుక్రవారం లాంగ్వేజ్ పేపర్–1 పరీక్ష నిర్వహించారు. ఫస్టియర్‌కు 6,170 మంది హాజరు కాగా 315 మంది గైర్హాజరయ్యారు. సెకండియర్ పరీక్ష 2,365 మంది రాయగా 211 మంది హాజరు కాలేదని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి కేశవరావు తెలిపారు.


