దారి ఖర్చులేవీ? | - | Sakshi
Sakshi News home page

దారి ఖర్చులేవీ?

May 18 2026 12:18 AM | Updated on May 18 2026 12:18 AM

గత ఏడాది పాఠశాలల విలీనం

ఆ సమయంలోనే రవాణా చార్జీలు చెల్లిస్తామని సర్కారు హామీ

ఆ మాట కాగితాలకే పరిమితం

స్కూలు దూరమై.. నడక భారమై.. విద్యార్థుల అవస్థలు

తల్లిదండ్రులు, విద్యార్థి నేతల అసంతృప్తి

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): గత ఏడాది ‘తొమ్మిది రకాల విభజన’ పేరిట ప్రభుత్వ పాఠశాలలను చంద్రబాబు ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈ క్రమంలో 3, 4, 5 తరగతుల్లో తక్కువ సంఖ్యలో విద్యార్థులున్న పాఠశాలలను గుర్తించింది. వారిని ఎక్కువ విద్యార్థులున్న పాఠశాలల్లో విలీనం చేసింది. ఆ దూరంగా ఉన్న పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. సమీపంలో పాఠశాలలు లేని గ్రామాల నుంచి వెళ్లే 6 నుంచి 14 సంవత్సరాల విద్యార్థులకు నెలకు రూ.600 చొప్పున, ఏడాదికి రూ.6 వేల రవాణా భత్యం అందిస్తామని గొప్పగా చెప్పింది. కానీ, ఈ మాటలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఫలితంగా పాఠశాల దూరమై.. పాఠశాలకు చేరుకోవడం భారమై విద్యార్థులు నానా అవస్థలూ పడుతున్నారు. దూరంగా ఉన్న పాఠశాలకు నడిచో లేక ఇతర వాహనాలపై ఆధారపడో.. ప్రకృతి అవరోధాలను ఎదుర్కొంటూ వారు వెళ్లాల్సి వస్తోంది. ఇస్తామన్న రవాణా భత్యాన్ని ప్రభుత్వం ఇవ్వకపోవడంతో పేద కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. ఫలితంగా వేలాదిగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదిలి ప్రైవేటు స్కూళ్లకు ఇంటి వద్దకే వస్తున్న బస్సులో వెళ్లిపోతున్నారు. ప్రభుత్వ తీరుపై ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అమలుకు నోచని ఉత్తర్వులు

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. కిలోమీటరు పరిధిలో ప్రాథమిక పాఠశాల లేకపోయినా, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 3 కిలోమీటర్ల పరిధిలో లేకపోయినా రవాణా భత్యం చెల్లించాలి. కానీ, ప్రభుత్వం పాఠశాలలనైతే ఇష్టానుసారం విలీనం చేసేసింది కానీ, దీని ఫలితంగా దూర ప్రాంతంలోని పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులకు రవాణా భత్యంగా ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. రైట్స్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ టు ఫ్రీ అండ్‌ కంపల్సరీ ఎడ్యుకేషన్‌ (ఆర్‌టీఈ) చట్టం ప్రకారం విద్యార్థులకు వారు నివసిస్తున్న ప్రాంతానికి చేరువలోనే పాఠశాల ఏర్పాటు చేయడం లేదా రవాణా సౌకర్యం కల్పించడం ప్రభుత్వ బాధ్యత. కానీ, ఈ రెండింటిలో ఏదీ సక్రమంగా పాటించకుండా పాఠశాలలను నిర్లక్ష్యంగా విలీనం చేశారనే విమర్శలు వస్తున్నాయి. పాఠశాలలు విలీనమైనట్లు కాగితాలపై చూపిస్తున్నప్పటికీ, భౌతికంగా విద్యార్థులు ఆ పాఠశాలలకు చేరకపోవడం గమనార్హం. రవాణా సౌకర్యం లేకపోవడం, రవాణా చార్జీలు చెల్లించకపోవడం వల్ల అనేక విద్యార్థులు చదువుకు దూరమవుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మళ్లీ పాఠశాలల విలీన ప్రక్రియను కొత్తగా చేపడుతున్నారు. దీనివలన జిల్లాలో వందలాదిగా పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదముందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అదే కనుక జరిగితే పేద విద్యార్థులకు చదువు మరింత దూరమయ్యే ప్రమాదం ఎదురవుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రవాణా చార్జీలు విడుదల చేయాలి

విద్యార్థుల హాజరు, ప్రయాణ సౌకర్యాలపై ప్రభుత్వం సమగ్ర సమీక్ష చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో సమీప పాఠశాలల బలోపేతంపై దృష్టి పెట్టాలి. ఇచ్చిన హామీలు అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రయోగాలు చేయకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. పాఠశాలల్లో మూడంచెల వ్యవస్థను పునరుద్ధరించాలి. ఒకటి నుంచి ఐదు తరగతులకు ప్రాథమిక, ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకూ ప్రాథమికోన్నత, ఆరు నుంచి పదో తరగతి వరకూ ఉన్నత పాఠశాలలను ఏర్పాటు చేయాలి.

– బి.సిద్ధూ, పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి

గతంలోనూ ఇలాగే..

గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్లు యూనిట్‌గా 100 మంది విద్యార్థులతో 2015లో ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా సమీపాన రెండు మూడు పాఠశాలలను విలీనం చేస్తూ నాటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా పాఠశాలలకు ప్రత్యేక పద్దుల్లో నిధులు మంజూరు చేస్తూ, తరగతికో ఉపాధ్యాయుడిని, ప్రత్యేక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయ పోస్టును, గ్రంథాలయం, భాషా ప్రయోగశాల ఏర్పాటు చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. అవేవీ కార్యరూపం దాల్చకపోగా పాఠశాలలు మూత పడటం మాత్రమే మిగిలింది.

– ఎం.గంగా సూరిబాబు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి

Advertisement
 
Advertisement
Advertisement