ఎయిర్‌పోర్టుకు భూములివ్వం | - | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టుకు భూములివ్వం

May 18 2026 12:18 AM | Updated on May 18 2026 12:18 AM

ప్రాణత్యాగానికై నా సిద్ధం

పోరాటానికి సిద్ధమవుతున్న బాధితులు

మళ్లీ తెర పైకి అన్నవరం – బెండపూడి ఎయిర్‌పోర్టు వ్యవహారం

తొండంగి: బెండపూడి – అన్నవరం ప్రాంతంలో ఎయిర్‌పోర్టు భూసేకరణ వ్యవహారం మళ్లీ తెర పైకి రావడంతో బాధిత గ్రామాల రైతులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇక్కడ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి తొండంగి మండలంలోని బెండపూడి, పీఈ చిన్నాయపాలెం, శంఖవరం మండలం అన్నవరం గ్రామ శివారు భూములు కలిపి సుమారు 1,200 ఎకరాలు సేకరించేందుకు గత ఏడాది రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేసింది. అప్పట్లో బాధిత రైతులందరూ ఎయిర్‌పోర్టుకు భూసేకరణ ప్రతిపాదన విరమించుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. కూటమి నేతలను కలసి వినతిపత్రాలు సమర్పించారు. చివరకు ఇక్కడ ఎయిర్‌పోర్టు ప్రతిపాదన లేదని వారు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రతిపాదిత భూముల్లో భారీగా లే అవుట్లు, ల్యాండ్‌ కన్వర్షన్లు చేసుకున్నారు.

లేదు లేదంటూనే..

ఇదిలా ఉండగా.. కొద్ది రోజులుగా ఎయిర్‌పోర్టు భూసేకరణ వ్యవహారం మరోసారి ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ఇప్పటికే భూసామర్థ్య పరీక్షలకు ప్రత్యేక అధికారుల బృందం పర్యటించింది. దీంతో, బాధిత గ్రామాల రైతుల్లో తిరిగి ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టు భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యాన అన్నవరం, బెండపూడి, పీఈ చిన్నాయపాలెం (ఏబీసీ) గ్రామాల రైతులు ఆదివారం బెండపూడిలో సమావేశమై, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇప్పటికే అన్నవరం బైపాస్‌ రోడ్డుకు, సాగరమాల రహదారికి, రైల్వే లైన్‌కు, పుష్కర, పోలవరం కాలువలకు భూములిచ్చి తాము తీవ్రంగా నష్టపోయామని చెప్పారు. ఇక్కడి వ్యవసాయ భూముల్లో రెండు పంటలు పండుతాయని, అందరూ చిన్న, సన్నకారు రైతులేనని వాపోయారు. భూములు కలిగిన రైతులు వెయ్యి మంది ఉండగా, వాటిపై ఆధారపడి మరో వెయ్యి మంది జీవిస్తున్నారని చెప్పారు. అరెకరం, ఎకరం భూములున్న రైతులు భూములను కోల్పోతే జీవనోపాధికి మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రం అన్నవరంలోని రత్నగిరి నోఫ్లై జోన్‌గా ఉందని గుర్తు చేశారు. ఎయిర్‌పోర్టు వల్ల ధ్వని, పర్యావరణ కాలుష్యంతో పాటు భక్తుల ప్రశాంతతకు కూడా ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పచ్చని పంట పొలాలను ఎయిర్‌పోర్టుకు ఇచ్చే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. భూసేకరణను ముక్తకంఠంతో వ్యతిరేకించారు. దీనిపై గతంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ భాస్కర్‌, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తదితరులను కలసి వినతిపత్రాలు ఇచ్చామని చెప్పారు. ఎయిర్‌పోర్టు వేరే ప్రాంతానికి తరలిపోతుందని, భూసేకరణ ప్రతిపాదన లేకుండా చేస్తామని అప్పట్లో వారు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం మళ్లీ తెర పైకి రావడంతో కూటమి నేతలు ఇచ్చిన హామీలు బుట్టదాఖలేనా అని ప్రశ్నించారు. భూసేకరణ ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని నినాదాలు చేశారు. అలా కాకుండా బలవంతంగా భూసేకరణకు సిద్ధపడితే ప్రాణత్యాగాలకై నా సిద్ధమని, భూములిచ్చే ప్రసక్తే లేదని, దీనిపై సమష్టిగా పోరాడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పోరాట కమిటీ అధ్యక్షుడు పాలచర్ల భాస్కరరావు, ఉపాధ్యక్షుడు గొంతెన నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి రాయవరపు ఆనంద్‌, రైతులు కొరపాటి కన్నబాబు, ఆర్‌.శ్రీరామ్మూర్తి, బి.శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement