కబ్జా కోరల్లో... | - | Sakshi
Sakshi News home page

కబ్జా కోరల్లో...

May 18 2026 12:18 AM | Updated on May 18 2026 12:18 AM

కనుమరుగు కానున్న

66 సాగునీటి చెరువులు

7 వేల ఎకరాల ఆయకట్టుకు ముప్పు

పట్టించుకోని అధికారులు

ప్రత్తిపాడు: అపర భగీరథులు తవ్వించిన ఆ చెరువులు ఒకప్పుడు ఆ గ్రామాలకు జీవనాధారం. వేలాది ఎకరాలకు సాగు, వేసవిలో గొంతు తడిపే తాగునీటిని అందించడంలో వాటి పాత్ర కీలకం. మూగ జీవాలకు సైతం ఇవే ప్రాణాధారం. కానీ, నేడు వాటి ఉనికే ప్రమాదంలో పడింది. ఒక్కొక్కటిగా అక్రమార్కుల కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నాయి. దీంతో, మండలంలో ఒకప్పుడు పుష్కలంగా నీరందించిన చెరువుల విస్తీర్ణం రోజురోజుకూ కుచించుకుపోతోంది.

ఇదీ పరిస్థితి

మండలంలోని 21 గ్రామాల్లో 66 సాగునీటి చెరువులున్నాయి. రాచపల్లిలో అత్యధికంగా 9, ధర్మవరంలో 7, లంపకలోవలో 6, ప్రత్తిపాడు, ఒమ్మంగి, వాకపల్లి గ్రామాల్లో ఐదేసి, చింతలూరులో 4, గజ్జనపూడి, పెదశంకర్లపూడి, శరభవరం, వెంకటనగరంలో మూడేసి, చినశంకర్లపూడి, ఉత్తరకంచి, కె.కొత్తపల్లిల్లో రెండేసి, పి.జగన్నాథపురం, పోతులూరు, పొదురుపాక, ఉద్దండ జగన్నాథపురం, పెద్దిపాలెం, తాడువాయి, ఏలూరు గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున చెరువులు ఉన్నాయి. వీటి ద్వారా గతంలో 7 వేల ఎకరాలకు పైగా పంట భూములకు సాగునీరు పుష్కలంగా అందేది. ఈ చెరువుల్లో నేడు కబ్జా కోరల్లో చిక్కుకోనిది ఒక్కటి కూడా లేదంటే అతిశయోక్తి కాదు. ఏటా వేసవిలో చెరువులు ఎండిపోవడం సహజం. దీనిని అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా రాత్రికి రాత్రే పొక్లెయిన్లతో మట్టి త వ్వి తరలించుకుపోతున్నారు. మరికొందరు గట్టుకు చే ర్చి ఉన్న తమ పొలాలను చెరువులోకి విస్తరిస్తూ, నీరు నిల్వ ఉండే ప్రాంతాన్ని సాగు భూమిగా మార్చేసుకుంటున్నారు. అడిగే నాథుడు లేకపోవడంతో ‘చెరువూ మాదే.. మట్టీ మాదే’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో, చిన్నపాటి వర్షానికే గట్లు తెగిపోతున్న పరిస్థితి ఉండగా.. ఆక్రమణల కారణంగా చెరువుల విస్తీర్ణం సైతం సగానికి పైగా తగ్గిపోయింది. లోతు, నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడంతో పూర్తి స్థాయిలో నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొద్దిపాటి వర్షానికే చెరువులు నిండిపోయి, గట్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో, దిగువన ఉన్న పంటలు దెబ్బ తినడమే కాకుండా, పొలాల్లో ఇసుక మేటలు వేసి రైతులు భారీగా నష్టపోతున్నారు.

అధికారుల నిర్లిప్త వైఖరి

చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదులు వస్తున్నా అధికారులు నిర్లిప్త వైఖరి అవలంబిస్తున్నారంటూ రైతులు ఆక్రోశిస్తున్నారు. రెవెన్యూ, జలవనరుల శాఖల మధ్య సమన్వయం లేనందువల్లనే ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారనే విమర్శలొస్తున్నాయి. జలవనరుల, పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోని చెరువుల్లో ఆక్రమణలు, అక్రమ తవ్వకాలు కళ్లెదుటే జరుగుతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా చెరువుల ఆక్రమణలు తొలగించాలని, చెరువుల సరిహద్దులపై రీ సర్వే చేయాలని, వీటిని అభివృద్ధి చేసి, సాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆక్రమణలు తొలగించాలి

చెరువుల ఆక్రమణల వల్ల ఆయకట్టుకు నీరందించే సామర్థ్యం తగ్గిపోతోంది. చెరువుల గర్భంలో పూడికలు తీసి, నీటి నిల్వ సామర్థ్యం పెంచాలి. ఆక్రమణలను వెంటనే తొలగించాలి.

– సీంద్రపు భాస్కరరావు,

ఎంపీటీసీ, రైతు, ప్రత్తిపాడు

రీ సర్వేలో సరిహద్దులు గుర్తిస్తాం

ప్రభుత్వం సాగునీటి చెరువులు, కాలువలపై రీ సర్వే చేపడుతుంది. దీని ద్వారా చెరువులు, కాలువల సరిహద్దులను గుర్తిస్తాం. ఆక్రమణలుంటే తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం.

– రాజేంద్ర ప్రసాద్‌,

డీఈఈ, జలవనరుల శాఖ, ఏలేశ్వరం

Advertisement
 
Advertisement
Advertisement