టిప్పర్‌ ప్రమాద బాధితులకు తక్షణ ఆర్థిక సాయం | - | Sakshi
Sakshi News home page

టిప్పర్‌ ప్రమాద బాధితులకు తక్షణ ఆర్థిక సాయం

May 18 2026 12:18 AM | Updated on May 18 2026 12:18 AM

ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ డిమాండ్‌

జీజీహెచ్‌లో క్షతగాత్రులకు పరామర్శ

సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ రూరల్‌ కొవ్వూరు బైపాస్‌ రోడ్డులో శనివారం జరిగిన టిప్పర్‌ ప్రమాదంలో మృతి చెందిన ఉపాధి కూలీల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ప్రత్యేక ఆర్థిక సాయం అందజేయాలని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ డిమాండ్‌ చేశారు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, మృతుల కుటుంబ సభ్యులను ఆదివారం ఆయన పరామర్శించి, ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, మృతుల కుటుంబాలు నిరుపేద, బడుగు వర్గాలకు చెందిన వారు కావడంతో, ప్రభుత్వం ఉదారంగా, మానవతా దృక్పథంతో తక్షణ ఆర్థిక సాయం ప్రకటించాలని కోరారు. క్షతగాత్రులకు ఎలాంటి లోటూ లేకుండా మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటువంటి ఘోర ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు రోడ్డు భద్రత విషయంలో అధికారులు అత్యంత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, తగిన చర్యలు చేపట్టాలని బోస్‌ సూచించారు.

గణపయ్యకు గణనీయ సేవలు

అయినవిల్లి: విఘ్నాలను తొలగించే అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి వారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యాన స్వామి వారికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, లక్ష్మీ గణపతి హోమం, గరిక పూజ నిర్వహించారు. స్వామి వారిని అర్చకులు వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మహా నివేదన చేశారు. రాత్రి ఎనిమిది గంటలకు విశేష సేవలు చేసిన అనంతరం ఆలయ తలుపులు మూసివేశారు. స్వామికి ఒక జంట పంచామృతాభిషేకం నిర్వహించింది. అలాగే, లఘున్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాల్లో 24 మంది భక్త దంపతులు పాల్గొన్నారు. 11 మంది భక్తులు గరిక పూజ నిర్వహించారు. 10 మంది భక్తులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు. ఇద్దరు భక్తులు ఉండ్రాళ్ల పూజ చేశారు. ఇద్దరు చిన్నారులకు తులాభారం నిర్వహించారు. ఓ చిన్నారికి నామకరణం చేశారు. ఎనిమిది మంది వాహన పూజలు చేయించుకున్నారు. వివిధ పూజా టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా స్వామివారికి రూ.2,90,554 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్‌ కమిషనర్‌ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement