● జనాభా పెంచాలనడం
చంద్రబాబు పిచ్చి సూత్రం
● ఎమ్మెల్యే పండుల రవీంద్రబాబు
కాకినాడ రూరల్: మూడో, నాలుగో సంతానాన్ని కంటే డబ్బులిస్తామని ప్రకటించిన చంద్రబాబు.. వాటిని బిడ్డ పుట్టినప్పుడు మాత్రమే ఇస్తారా లేక ప్రతి ఏటా ఇస్తారా అని వైఎస్సార్ సీపీ నాయకుడు, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు నిలదీశారు. కాకినాడలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పేద కుటుంబంలో మూడు నాలుగుసార్లు గర్భం ధరించే తల్లుల బాధలు చంద్రబాబుకు పట్టవా అని ప్రశ్నించారు. ఇద్దరు పిల్లల్ని కనడమే కష్టమైన పేదలకు.. అదనంగా పిల్లలను కనడం ఇంకెంత కష్టమో తెలియదా అని నిలదీశారు. పేదరికంలో ఉన్న తల్లుల్లో 40 శాతం మంది రక్తహీనతతో బాధ పడుతున్నారని, పిల్లల్ని కంటే వారి ఆరోగ్య పరిస్థితి మాటేమిటని ప్రశ్నించారు. రూ.30 వేలు, రూ.40 వేల కోసం పిల్లల్ని కంటే తరువాత వారిని ప్రభుత్వం చూస్తుందా అని మండిపడ్డారు. జనాభా పెంచాలనడం చంద్రబాబు పిచ్చి సూత్రమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనంగా పిల్లల్ని కనండనడంలో శాసీ్త్రయత లేదన్నారు. అశాసీ్త్రయమైన సిద్ధాంతాలను వ్యాప్తి చేసి ప్రజలను అయోమయానికి గురి చేయొద్దని కోరారు. ‘మూడో, నాలుగో సంతానం సూత్రాన్ని మీ కుటుంబంలో లోకేష్‌కు ఎందుకు చెప్పరు’ అని ప్రశ్నించారు. అలా కంటే లోకేష్ అందరికీ ఆదర్శంగా ఉంటారని రవీంద్రబాబు చెప్పారు.


