సీతారాములకు ప్రత్యేక సింహాసనం | - | Sakshi
Sakshi News home page

సీతారాములకు ప్రత్యేక సింహాసనం

May 18 2026 12:18 AM | Updated on May 18 2026 12:18 AM

అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని నిత్య కల్యాణానికి పెళ్లి పెద్దలుగా వ్యవహరించే క్షేత్ర పాలకులు సీతారాములకు ఎట్టకేలకు ప్రత్యేక సింహాసనం సమకూరింది. ఆలయ అర్చకుడు కంచిభట్ల రామ్‌కుమార్‌ సీతారాముల కోసం రూ.50 వేలతో టేకు సింహాసనాన్ని తయారు చేయించి, ఈఓ నల్లం సూర్యచక్రధరరావుకు ఆదివారం అప్పగించారు. సత్యదేవుని నిత్యకల్యాణం సమయంలో ఒకే సింహాసనంపై సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను, వారి దిగువన సీతారాముల విగ్రహాలను ఉంచి కల్యాణం నిర్వహించేవారు. దీంతో, సత్యదేవుడు, అమ్మవారికి పోసే తలంబ్రాలు దిగువన ఉన్న సీతారాముల విగ్రహాల మీద పడేవి. పెళ్లిపెద్దలను ప్రత్యేకంగా గౌరవించాలే తప్ప ఇలా చేయడం అపచారమని భక్తులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని 2024 జూన్‌లో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ మేరకు అప్పటి ఈఓ, ప్రసుత దేవదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్ర మోహన్‌ సత్యదేవుని నిత్యకల్యాణంలో సీతారాములను మరో ఆసనంపై విడిగా ప్రతిష్ఠించాలని ఆదేశించారు. అప్పటి నుంచీ అదేవిధంగా చేస్తున్నారు. సీతారాముల ఉత్సవమూర్తుల వెనుక అలంకరించేందుకు వ్రత పురోహిత సంఘం వెండి మకరతోరణం తయారు చేయించి 2025లో సమర్పించింది. ఇప్పుడు అర్చకుడు రామ్‌కుమార్‌ దాతృత్వంతో సీతారాములకు టేకు సింహాసనం కూడా సమకూరింది.

Advertisement
 
Advertisement
Advertisement